Telangana: హైకోర్టుకు కామారెడ్డి రైతులు

  • కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
  • మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు
  • మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామంటున్న రైతులు
Kamareddy farmers file writ petition in Highcourt over master paln

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై అక్కడి రైతుల ఆందోళన తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన, కామారెడ్డి పట్టణ బంద్ తో వాతావరణం వేడెక్కింది. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా, బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చి అరెస్టయ్యారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మరోవైపు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డి సరిహద్దు గ్రామమైన రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు అయిన రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు కోర్టు‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా భూములను రిక్రియేషనల్ జోన్‌గా ప్రకటించడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసును హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉందని రైతుల తరపు న్యాయవాది టి. సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ రైతులను ఇబ్బంది పెట్టేలా ఉందని చెబుతున్నారు. 

రామేశ్వర్ పల్లి రెవెన్యూ గ్రామంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టణాభివృద్ధి అవకాశ ప్రాంతంగా చూపించటం అనేక అనుమానాలకు తావిస్తుందని కేసు వేసిన గ్రామ రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకొని రైతుల భూముల జోలికి రావొద్దని కోరారు. మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకునేంత వరకూ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు కైనా వెళ్తామని వారు హెచ్చరించారు.

More Telugu News