cancer: తన మరణం గురించి ఆరేళ్ల బాబు చేసిన విజ్ఞప్తి మనసును కదిలించిందన్న డాక్టర్!

  • క్యాన్సర్ తో బాధపడుతున్న బాబుకు నిజం తెలియకూడదని తల్లిదండ్రుల తాపత్రయం 
  • తనకు నిజం తెలుసనే విషయం పేరెంట్స్ కు తెలియనీయొద్దని ఆ బాబు విజ్ఞప్తి
  • ఈ ఘటనను ట్విట్టర్ లో షేర్ చేసిన హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యుడు
6 yr old requests Hyderabad doctor heart touching story is viral

ఆటపాటలే లోకంగా బతికే ఆరేళ్ల బాబుకు అరుదైన క్యాన్సర్ వచ్చింది. ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బతకడని వైద్యులు చెప్పారు. బిడ్డే లోకంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులు దీనిని తట్టుకోలేకపోయారు. అయితే, కొడుకుకు ఈ విషయం తెలియనీయొద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఆ పిల్లాడి నోటా అదే విజ్ఞప్తి. తనకు నిజం తెలుసనే సంగతి తన తల్లిదండ్రులకు చెప్పొద్దని వైద్యులను కోరాడు. ఆరేళ్ల బాబు ఇలా అడగడం తన మనసును కదిలించిందని, కాసేపటిదాకా తన నోటమాట రాలేదని డాక్టర్ చెప్పాడు. ఈ సంభాషణను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడా డాక్టర్..

హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ తన ట్విట్టర్ లో ఈ వివరాలు పంచుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆరేళ్ల కుర్రాడు మనూను చెకప్ కోసం పేరెంట్స్ తన దగ్గరకు తీసుకొచ్చారని డాక్టర్ సుధీర్ చెప్పారు. రిపోర్టులు పరిశీలించాక మనూ పేరెంట్స్ తో విడిగా మాట్లాడానని.. తమ కొడుకుకు క్యాన్సర్ విషయం తెలియనివ్వొద్దని పేరెంట్స్ చేసిన విజ్ఞప్తిని మన్నించినట్లు తెలిపారు. ఆ తర్వాత మనూ కూడా తనతో ప్రైవేటుగా మాట్లాడాడని, అప్పుడు మనూ చేసిన విజ్ఞప్తి తనను కదలించిందని చెప్పారు. 

‘డాక్టర్.. నాకు క్యాన్సర్ అని, మరో ఆరు నెలలకంటే ఎక్కువ కాలం బతకననీ తెలుసు. ఐపాడ్ లో చదివి ఈ వ్యాధి గురించి తెలుసుకున్నా. కానీ నాకు నిజం తెలుసనే విషయం మా అమ్మానాన్నలకు చెప్పొద్దు. ప్లీజ్’ అని మనూ కోరాడని డాక్టర్ సుధీర్ చెప్పారు. అయితే, మనూకు ఇచ్చిన మాటను తను నిలబెట్టుకోలేకపోయానని తెలిపారు. వెంటనే మనూ పేరెంట్స్ ను లోపలికి పిలిచి మరోమారు ఒంటరిగా మాట్లాడినట్లు వివరించారు. ఈ విషయం మనూ పేరెంట్స్ కు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ సుధీర్ తెలిపారు.

తొమ్మిది నెలలు గడిచాక మనూ పేరెంట్స్ మళ్లీ వచ్చి తనను కలిశారని డాక్టర్ సుధీర్ తెలిపారు. ‘మనూ చనిపోయి నెల రోజులు అయింది. తనకు క్యాన్సర్ అనే విషయం తెలుసని చెప్పడమే మంచిదయ్యింది. మిగిలిన రోజులు తనను ఎలా సంతోషంగా ఉంచాలా అని ఆలోచించాం. ఆఫీసుకు సెలవు పెట్టి మనూ చూడాలనుకున్న ప్రదేశాలను అన్నీ తిప్పి చూపించాం. మనూ జీవితంలోని ఎనిమిది నెలల కాలం సంతోషంగా గడిచిందంటే.. ఆ రోజు మీరు నిజం చెప్పడంవల్లే. మనూను సంతోషంగా సాగనంపాం’ అని మనూ పేరెంట్స్ వెల్లడించారని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు.

More Telugu News