Chandrababu: నేను ఆకాశం నుంచి మాట్లాడాలా?.. జగన్ పని అయిపోయింది: చంద్రబాబు

Jagan fires on Jagan
  • కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • భయపడి చీకటి జీవో తీసుకొచ్చారని విమర్శలు  
  • బాబాయ్ ని ఎవరు చంపారో డీజీపీ కనిపెట్టాలని ఎద్దేవా
తన సొంత నియోజకవర్గంలో తనను పర్యటించకుండా, ర్యాలీ నిర్వహించకుండా, సభ పెట్టకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని... టీడీపీ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని... అందుకే భయపడి చీకటి జీవో తీసుకొచ్చారని అన్నారు. నిన్న జగన్ సభకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చి, వాటి బస్సుల్లో జనాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి మహిళలను బలవంతంగా తరలించారని చెప్పారు. 

ఇప్పుడు తన సొంత ఇల్లు కుప్పంకు తనను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో టీడీపీ సభలు పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. నా ప్రజలతో నేను కలవకూడదా? అని మండిపడ్డారు. పోలీసులు కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాలని అన్నారు. జగన్ నియంతగా మారారని... ఆయన పాలన పోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. 

ఏ చట్టం ప్రకారం తనను మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అడిగారు. తన రోడ్ షోకు, సభకు ఎందుకు అనుమతిని ఇవ్వడం లేదో రాసివ్వాలని పోలీసులను అడిగానని... ఇంత వరకు వారి నుంచి స్పందన లేదని చెప్పారు. డీజీపీకి చిత్తశుద్ధి ఉంటే బాబాయ్ ని గొడ్డలితో ఎవరు నరికి చంపారో కనిపెట్టాలని అన్నారు. ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News