navodaya: నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవిగో

jawahar navodaya admission notification
  • ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష.. ప్రతిభ ఆధారంగా అడ్మిషన్
  • ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు
దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేఎన్ వీఎస్ టీ) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఫలితాల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఈ ప్రకటనలో తెలిపింది.

దేశం మొత్తమ్మీద 649 నవోదయ విద్యాలయాలు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో 22 విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో విద్యాలయంలో ఆరో తరగతికి 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. జిల్లాల వారీగా ఈ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. ఈ కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో బాలబాలికలకు విడివిడిగా హాస్టళ్లు ఉంటాయి. 

భోజన, వసతి సదుపాయాలతో పాటు యూనిఫాం, బుక్స్ కూడా ఉచితంగా అందిస్తారు. తొమ్మిది నుంచి 12 వ తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలనెలా రూ.600 చెల్లించాలి. బాలికలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, పేదలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

అర్హత: ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు, ఎన్‌ఐఓఎస్‌ నుంచి గతేడాది సెప్టెంబరు 15 నాటికి బీ సర్టిఫికెట్‌ కాంపిటెన్సీ కోర్సు పూర్తిచేసినవారు కూడా అర్హులే. విద్యార్థులు 2011 మే 1 నుంచి 2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. 

పరీక్ష: మొత్తం వంద మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్, లాంగ్వేజెస్ లో నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షను తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.

దరఖాస్తులు ఇలా..: నవోదయ వెబ్ సైట్ లో విద్యార్థి ఫొటో, సంతకం, తల్లి/ తండ్రి సంతకం, ఆధార్‌ కార్డ్‌/ నివాస ధ్రువపత్రం, స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నుంచి వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాలి.

ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 29

వెబ్‌సైట్‌: www.navodaya.gov.in
navodaya
jnvst
nvs
navodaya schools
navodaya entrance
sixth class

More Telugu News