Anam Ramanarayana Reddy: ఆనంపై వైసీపీ క్రమశిక్షణ చర్యలు... వెంకటగిరి బాధ్యతలు రామ్ కుమార్ రెడ్డికి అప్పగింత

  • ఇటీవల అసంతృప్తి గళం వినిపిస్తున్న ఆనం రామనారాయణరెడ్డి
  • నేడు కూడా వ్యాఖ్యలు.. సీఎం జగన్ ఆగ్రహం
  • చర్యలు తీసుకోవాలంటూ ముఖ్య నేతలకు ఆదేశాలు
YCP removes Anam Ramanarayana Reddy from Venkatagiri YCP incharge post

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కొంతకాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వైసీపీ నాయకత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. 

ఈ క్రమంలో వెంకటగిరి నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి పదవి నుంచి ఆనంను తొలగించారు. ఆయన స్థానంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి నూతన ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు వైసీపీ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకలాపాలన్నీ ఇకపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతాయన్నది ఆ ప్రకటన ద్వారా చెప్పారు. 

అయితే ఈ మార్పుపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆనం రామనారాయణరెడ్డి అంటున్నారు. దీనిపై ఆయన తదుపరి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 

కాగా, ఆనం ఇటీవల చేస్తున్న వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకత్వం చాలా వరకు వేచి చూసే ధోరణి అవలంబించింది. ఆనం ఇవాళ కూడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో సీఎం జగన్ పార్టీ ముఖ్యనేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆనంపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదన్న సంకేతాలు పంపించారు.

More Telugu News