Rishabh Pant: పంత్ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం

Uttarakhand CM said state govt will bare Rishabh Pant treatment expenses
  • ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై పంత్ కారుకు ప్రమాదం
  • దగ్ధమైపోయిన మెర్సిడెస్ బెంజ్ కారు
  • గాయాలతో ఆసుపత్రిపాలైన పంత్
  • డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో చికిత్స
  • ప్రాణాపాయం లేదన్న డాక్టర్ 
ఢిల్లీ-డెహ్రాడూన్ రహదారిపై టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తలకు గాయాలు, మోకాలి ఫ్రాక్చర్, వీపుపై కాలిన గాయాలతో పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. రిషబ్ పంత్ చికిత్సకు అయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

కాగా, పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్ కు వైద్యసాయం అందిస్తున్న డాక్టర్ ఆశిష్ యాజ్ఞిక్ స్పందిస్తూ, పంత్ కు ప్రాణాపాయం లేదని తెలిపారు. పంత్ కు ఓ మోస్తరు గాయాలు తగిలాయని వివరించారు. 

అటు, పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పంత్ రూర్కీ వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, నుదుటిపై రెండు గాయాలయ్యాయని, కుడి మోకాలి లిగమెంట్ తెగిపోయిందని, కుడి మణికట్టు, మడమ, కాలి బొటనవేలికి గాయాలయ్యాయని, వీపుపై కాలిన గాయాలయ్యాయని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. 
పంత్ ను తొలుత డెహ్రాడూన్ లోని సాక్షమ్ హాస్పిటల్ మల్టీస్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్ లో చేర్చారని, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మ్యాక్స్ హాస్పిటల్ కు తరలించారని వివరించారు. 

తాము పంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, చికిత్స అందిస్తున్న వైద్యులతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని షా తెలిపారు. పంత్ కోలుకునే క్రమంలో అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
Rishabh Pant
Road Accident
Uttarakhand
Team India

More Telugu News