Varla Ramaiah: మంత్రి కాకాని ఫైల్ చోరీ కేసు సీబీఐకి అప్పగించడం మంచిదే... కానీ...!: వర్ల రామయ్య

  • కోర్టులో చోరీకి గురైన కాకాని కేసు ఫైలు
  • కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
  • కాకాని మంత్రి పదవిలో ఉంటే ఎలా న్యాయం జరుగుతుందన్న వర్ల
Varla Ramaiah tweets on Kakani case issue

మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఫైలు నెల్లూరు కోర్టులో చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును ఇటీవల ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు.

"ముఖ్యమంత్రి గారూ... మంత్రి కాకాని కేసు ఫైలు దొంగతనం దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించడం మంచిదే. కానీ, ఈ కేసులో ప్రముఖంగా ఉన్న మంత్రి కాకాని పదవిలో ఉన్నా, మరో కీలక వ్యక్తి జిల్లా ఎస్పీ అధికారంలో అక్కడే కొనసాగినా న్యాయం జరుగుతుందా? ఇందులోనైనా మంచి నిర్ణయం తీసుకోండి సార్" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు. 

గతంలో, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పలు దేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని పత్రాలను తెరపైకి తెచ్చారు. అయితే, అవి ఫోర్జరీ పత్రాలు అని సోమిరెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాకానిపై చార్జిషీటు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతుండగా, కోర్టు కార్యాలయం నుంచి ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు చోరీకి గురయ్యాయి.

More Telugu News