Pawan Kalyan: యూనివర్సిటీలను ఫ్లెక్సీలతో నింపేయడం ఏం సూచిస్తోంది?: పవన్ కల్యాణ్

Pawan Kalyan opines on banners in universities
  • ఆంధ్రా యూనివర్సిటీలో సీఎం ఫ్లెక్సీలు
  • విద్యార్థి లోకానికి ఏం సూచన ఇస్తున్నారన్న పవన్
  • సీఎంపై అనురాగం ఉంటే ఇంటికి పరిమితం చేసుకోవాలని హితవు
  • ఒత్తిడి తెచ్చి వేడుకలు చేయించడం సరికాదని వెల్లడి
రాష్ట్రంలోని యూనివర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చొద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హితవు పలికారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని, కానీ ఏపీలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందని పవన్ అభిప్రాయపడ్డారు. 

యూనివర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చివేసి, ఆ పార్టీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో ప్రాంగణాలు నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోందని ప్రశ్నించారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని జరుగుతుందని సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందని పవన్ పేర్కొన్నారు. 

9 దశాబ్దాల పైబడిన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీలో చోటుచేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమైనవి అని ప్రశ్నించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సీఆర్ రెడ్డి వంటి గొప్పవారు ఉప కులపతులుగా బాధ్యతలు నిర్వర్తించిన సరస్వతి ప్రాంగణం ఆంధ్రా విశ్వవిద్యాలయం అని అభివర్ణించారు. ఆ విద్యావనం నుంచి ఎంతో మంది మేధావులు వచ్చారని, అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేస్తూ పార్టీ ఫ్లెక్సీలు కట్టించేవాళ్లు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆలోచించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనూ ఇదే పోకడ కనిపిస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్లకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ, ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలని మనవి చేస్తున్నామని తెలిపారు. 

విద్యార్థులు, చిరుద్యోగులపై ఒత్తిడి తెచ్చి వేడుకలు చేయించడం, బలవంతపు పార్టీ మార్పిళ్లకు పాల్పడడం విడిచిపెట్టాలని హితవు పలికారు. యూనివర్సిటీల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించి, యూనివర్సిటీ అభివృద్ధి కోసం, విద్యార్థుల అభ్యున్నతి కోసం వైస్ చాన్సలర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
Pawan Kalyan
Banners
University
Janasena
Andhra Pradesh

More Telugu News