KA Paul: విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన కేఏ పాల్

  • ఏపీలో పర్యటించిన కేఏ పాల్
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వ్యాఖ్యలు
  • ఏపీని కాపాడాలని వినతి 
KA Paul submits memorandum to Ambedkar statue in Vijayawada

వైసీపీ, టీడీపీ గూండాల నుంచి ఏపీని కాపాడాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినట్టు రుజువైందని అన్నారు. వైసీపీ గూండాలు, టీడీపీ గూండాల మధ్య దాడులు, హత్యలు జరుగుతున్నాయని, ఇలాంటి వాతావరణంలో ఉండలేక కియా వంటి సంస్థలు వెళ్లిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు.

పలు జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా తనను వందల మంది కలిశారని, తమకు బుద్ధి వచ్చిందని ఇప్పుడు చెబుతున్నారని వెల్లడించారు. 2014లో చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేస్తామన్నారని, ఆంధ్రప్రదేశ్ ను అమెరికాలా చేస్తామన్నారని, కానీ సీమాంధ్రను చీమల ఆంధ్రగా మార్చేశారని, ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని కేఏ పాల్ విమర్శించారు. 

రాజధాని అమరావతిలో రైతుల నుంచి చవకగా కొట్టేసిన రూ.3 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు, లోకేశ్, టీడీపీ గూండాలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ దీనిపై సీఎం జగన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా అక్రమ మార్గాల్లో దాడులు చేస్తున్నారని, అవినీతి మార్గాల్లో చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

దీన్నిబట్టి ఈ రెండు పార్టీలు తమకు వద్దని ఏపీ ప్రజలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారని కేఏ పాల్ వెల్లడించారు. పాల్ గారూ మీరు మూడేళ్ల నుంచి తెలంగాణలోనే ఉండిపోతున్నారు... ఏపీకి మూడు నెలలకు ఓసారి వస్తున్నారు అని ఏపీ ప్రజలు నాతో అంటున్నారు. 2019లో నేను చెప్పిన మాట మీరు విన్నారా అని వాళ్లను నేను నిలదీశాను" అని వివరించారు.

More Telugu News