Chandrababu: మాచర్ల దాడుల బాధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్

  • మాచర్లలో అల్లర్లు
  • గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించిన చంద్రబాబు
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా
  • కేసుల విషయం పార్టీ చూసుకుంటుందని హామీ
TDP Chief Chandrababu talks to injured TDP wrokers in Macherla clashes

మాచర్లలో దాడికి గురైన టీడీపీ నేతలు, కార్యకర్తలతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు. దాడిలో గాయపడిన, ఆస్తులు నష్టపోయిన పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. ప్రతి ఒక్క బాధితునితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

పోలీసుల అండతోనే తమపై, ఇళ్లపై దాడులు జరిగాయని బాధితులు చంద్రబాబుకు వివరించారు. ఇళ్లు, కార్లు ధ్వంసం చేసిన విధానాన్ని ఆయనకు తెలియజేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి దైర్యం చెప్పారు. ఇంట్లో వస్తువులు, కార్లు ధ్వంసం చేసిన కారణంగా నష్టపోయిన కుటుంబాలను పార్టీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. 

ఓ పక్క దాడులతో తీవ్ర ఆవేదనలో ఉన్న బాధిత వర్గంపైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టిన విధానాన్ని జిల్లా నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. 24 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కేసుల విషయం కూడా పార్టీ చూసుకుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. 

కేవలం పార్టీ నేతలను అక్రమ కేసుల నుంచి బయటపడెయ్యడమే కాకుండా, కారకులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మాచర్ల ఘటన ముమ్మాటికి ప్రభుత్వ హింసే అని, ప్రణాళిక ప్రకారం జరిగిన దాడులకు జిల్లా ఎస్పీ సహకరించారని చంద్రబాబు ఆరోపించారు.

More Telugu News