first ever: సైన్స్ మహిమ.. తల్లి గర్భం లేకుండానే పిల్లల్ని పుట్టించవచ్చు!

EctoLife The concept of the world first ever artificial womb facility has been unveiled
  • కృత్రిమ గర్భ వ్యవస్థను అభివృద్ధి చేసిన జర్మనీ శాస్త్రవేత్త
  • ఎక్టోలైఫ్ పేరిట అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటన
  • నచ్చిన రంగు, పొడవు, బలంతో శిశువులను కనొచ్చని వెల్లడి
సంతాన సమస్యలు ఉన్నవాళ్లు ఐవీఎఫ్ ను ఆశ్రయించి పిల్లల్ని కంటున్నారు. కొందరు సెలబ్రిటీలు అద్దె గర్భాన్ని ఆశ్రయిస్తున్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుల వల్లే ఇలాంటివి సాధ్యం అవుతున్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తల్లి గర్భం అవసరం లేకుండా పిల్లలు రాబోతున్నారు. అంతేకాదు నచ్చిన రంగు, పొడవు, బలాన్ని ఎంచుకొని పిల్లలను కనొచ్చు. జర్మనీకి చెందిన బయోటెక్నాలజిస్టు హషీం అల్‌ ఘైలీ ‘ఎక్టోలైఫ్‌’ పేరిట సిద్దం చేసిన ఒక కృత్రిమ గర్భ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యం కానుంది. ఇందులో తల్లి గర్భంతో ఏమాత్రం పని ఉండదని ఆయన అంటున్నారు. బిడ్డలు తయారయ్యేందుకు వీలుగా పాడ్స్‌ ఉంటాయని అందులో తమకు నచ్చినట్టుగా శిశువులను పొందవచ్చని ఆయన ప్రకటించారు.  

ప్రస్తుతం ఐవీఎఫ్‌ విధానాన్ని చాలామంది అనుసరిస్తున్నారు. ఇందులో తండ్రి శుక్రకణాన్ని, తల్లి అండాన్ని సేకరించి ఫలదీకరిస్తారు. అనంతరం తిరిగి అదే తల్లి గర్భంలో లేదా వారు కోరిన అద్దె గర్భంలో ప్రవేశపెడతారు. తద్వారా వైద్యులు వారికి బిడ్డని అందిస్తున్నారు. అయితే, ‘ఎక్టోలైఫ్’ వ్యవస్థలో తల్లి గర్భంతో సంబంధమే ఉండదు. శుక్రకణాన్ని, అండాన్ని ఫలదీకరించి తల్లి గర్భానికి బదులు ఎక్టోలైఫ్‌ వ్యవస్థలో పెట్టెలాంటి ప్రత్యేక పాడ్‌ లో పెడతారు. పిండం దశ నుంచి బిడ్డ దశ వరకూ అందులోనే బిడ్డ ఎదుగుతుంది. తల్లి గర్భంలో ఉన్న పరిస్థితులనే పాడ్‌లో ఏర్పాటు చేస్తారు. కృత్రిమ బొడ్డు పేగును కూడా శిశువులకు అమరుస్తారు. 

జన్యు ఎడిటింగ్‌ సాంకేతికత ద్వారా బిడ్డ రంగు, ఎత్తు, బలం వంటివన్నీ ముందుగానే తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు. ఎక్టోలైఫ్ లో ఒక్కో భవనంలో ఏడాదికి 30 వేల మంది శిశువులను పుట్టించవచ్చని హషీం చెబుతున్నారు. మానవ అండంపై పరిశోధన, కృత్రిమ గర్భధారణ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక నిబంధనలు సడలిస్తేనే ఎక్టోలైఫ్ ను అందుబాటులోకి తీసుకురాగలమని వివరించారు. అన్ని దేశాల్లోనూ ఎక్టోలైఫ్‌ విస్తృతంగా అందుబాటులోకి రావడానికి 10–15 ఏళ్లు పట్టొచ్చని అన్నారు.
first ever
artificial womb
science
EctoLife
child

More Telugu News