Viraj Ashwin: ఓటీటీ రివ్యూ: 'వాళ్లిద్దరి మధ్య'

  • 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'వాళ్లిద్దరి మధ్య'
  • నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సినిమా 
  • బలహీనమైన కథాకథనాలు 
  • యూత్ కనెక్ట్ అయ్యే అంశాలకు దూరంగా కంటెంట్
  • 'ఇగో'లకు పాత్రల నిచ్చి విసిగించిన దర్శకుడు 
Valliddari Madhya OTT Review

ఈ మధ్య కాలంలో 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చే సినిమాలను పరిశీలిస్తే, లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలకు వారు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఒక జంట ప్రేమకథ .. ఇరు కుటుంబాల నేపథ్యంలో ఆ ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందనేది ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది.  అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమానే 'వాళ్లిద్దరి మధ్య'. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్  బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. 

'వాళ్లిద్దరి మధ్య' .. అనే టైటిల్ చూడగానే .. 'వాళ్లిద్దరి మధ్య' ఏం జరిగిందేంటి? అనే ఒక సందేహం తలెత్తుతుంది. అది తెలుసుకోవాలనుకున్నవారే ఈ కథను ఫాలో అవుతారు. వాళ్లిద్దరూ హీరో - హీరోయిన్ అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. హీరో విషయానికే వస్తే .. వరుణ్ (విరాజ్) సొంతంగా ఒక బిజినెస్ మొదలుపెడతాడు. NRI పేరెంట్స్ కి అందుబాటులో ఉంటూ .. వారికి కావలసినవి సమకూర్చడమే అతని సంస్థ 'అనన్య' ముఖ్య ఉద్దేశం.

ఓ NRI ఫ్యామిలీకి సహాయం కోసం వెళ్లిన వరుణ్ కి, వీడియో కాల్ ద్వారా 'అనన్య' పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి పేరు కూడా తన సంస్థ పేరే కావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తొలి చూపులోనే ఆ అమ్మాయిపై మనసు పారేసుకుంటాడు. కొన్ని రోజుల తరువాత అనన్య ఫారిన్ నుంచి వస్తుంది. దాంతో ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. ఫారిన్ లో బ్రేక్ అప్ జరగడం వల్లనే అనన్య వచ్చేసిందని ఆ సమయంలోనే అతనికి తెలుస్తుంది. 

ఒక రోజున తన పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో అనన్య కాల్ చేయడంతో వరుణ్ ఆమె ఇంటికి వెళతాడు. అయితే అనుకోకుండా అక్కడ జరిగిన ఒక సంఘటన కారణంగా అనన్య ఇగో హర్ట్ అవుతుంది. ఆమె ధోరణికి వరుణ్ కూడా హర్ట్ అవుతాడు. ఆ క్షణం నుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇంతకీ ఆ రోజున వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేదే కథ. 

ప్రేమలో పడిన తరువాత అపార్ధాలు .. అలకలు కామన్. ప్రేమకథా చిత్రాల్లో హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ తోనే ఆడియన్స్ కనెక్ట్ కావాలి. ఆ తరువాత వాళ్ల ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంటూ వాళ్లతో ట్రావెల్ చేయడం మొదలుపెడతారు. నాయకా నాయికలు కలుసుకోవడానికి గానీ .. అపార్థం చేసుకుని విడిపోవడానికిగాని ఒక బలమైన కారణం ఉండాలి. అవి తొలగిపోయే తీరు సహజంగా అనిపించాలి. మళ్లీ వాళ్లిద్దరూ కలుసుకుంటే, గుండెలపై భారం దిగిపోయినట్టుగా ప్రేక్షకులు 'హమ్మయ్య' అనుకోవాలి. అలాంటి ఏ ఫీలింగును కలిగించలేని కథ ఇది.

ప్రేమికులు విడిపోవడానికి ప్రధానమైన శత్రువు 'ఇగో' అని ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రతోనే చెప్పించారు. 'లోపలి మనిషి' అనే మాటకు 'లోమ' అనే కొత్త పదాన్ని కనిపెట్టేసి విపరీతంగా వాడేశారు. పాత సినిమాల్లో అవసరమైప్పుడు అంతరాత్మ బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అలా ఈ సినిమాలో 'లోపలి మనిషి'  అంటే 'ఇగో' అనేది బయటికి వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది.

అంతరాత్మ అయినా .. 'ఇగో' అయినా ఒకటి .. రెండు సార్లకి మించి బయటికి రాకూడదు. అలా వస్తే డ్యూయెల్ రోల్ అనుకునే ప్రమాదం లేకపోలేదు. ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ప్రతిసారి అటు హీరోలో నుంచి .. ఇటు హీరోయిన్ లో నుంచి 'లోపలి మనిషి' బయటికి వచ్చేస్తుంటాడు. దాంతో ఇద్దరు హీరోలను .. ఇద్దరు హీరోయిన్లను చూడవలసి వస్తుంది. పోనీ కథాకథనాల్లో కొత్తదనం ఏదైనా ఉంటే ఈ నలుగురినీ భరించవచ్చు .. కానీ అదెక్కడా మచ్చుకి కూడా మనకి కనిపించదు. 

చెప్పుకోదగిన మాటలుగానీ .. గుర్తుకొచ్చే పాటలు గాని లేవు. ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ గా మధు స్రవంతి పరిచయమయ్యారు ... కానీ తనదైన మార్క్ చూపించడానికి ఎలాంటి ప్రయత్నం కనిపించలేదు. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ కూడా చెప్పుకోదగిన స్థాయిలో అనిపించవు. ఇటు హీరో .. హీరోయిన్స్, అటు వాళ్ల ఫాదర్ పాత్రలను పోషించిన పాత్రల నటన గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. 'మనసంతా నువ్వే' .. 'నేనున్నాను' వంటి హిట్స్ ఇచ్చిన వీఎన్ ఆదిత్య నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవరూ అనుకోరు.  

More Telugu News