JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసిన ఎన్‌టీఏ

  • దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా
  • రూ. 325 ఉన్న అమ్మాయిల ఫీజు రూ. 800కు పెంపు
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఫీజును రూ. 325 నుంచి రూ. 500కు పెంపు
JEE Main Exam Fee Hiked by NTA

రెండు రోజుల క్రితం జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష ఫీజులను భారీగా పెంచేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24-31 మధ్య జరగనున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 

ఇప్పుడీ పరీక్షల దరఖాస్తు ఫీజును ఎన్‌టీఏ భారీగా పెంచేసింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలకు ఇప్పటి వరకు రూ. 650 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 1000కి పెంచేసింది. అదే కేటగిరీలోని అమ్మాయిల ఫీజును రూ. 325 నుంచి రూ. 800 చేసింది. ఇక, ఎస్‌టీ, ఎస్‌సీ, దివ్యాంగులకు ఇప్పటి వరకు రూ. 325 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విదేశీ అమ్మాయిల ఫీజును రూ. 1,500 నుంచి రూ. 4వేలకు, అబ్బాయిల ఫీజును రూ. 3 వేల నుంచి రూ. 5వేలకు పెంచింది. దీంతోపాటు బీఆర్క్, బీ ప్లానింగ్‌లో చేరేందుకు నిర్వహించే పేపర్-2 దరఖాస్తు ఫీజును కూడా భారీగా పెంచారు.

More Telugu News