Visakhapatnam: చిన్నారి అల్లరి చేస్తోందని.. అగ్గిపుల్లతో ముఖంపై చురకలు పెట్టిన అంగన్‌వాడీ ఆయా

Anganwadi Aya who burnt Girl Child face with match Sticks
  • విశాఖపట్టణంలోని సీతంపేట పరిధిలో ఘటన
  • చిన్నారి బాధతో ఏడుస్తున్నా వదలని ఆయా
  • విచారణ జరిపిస్తున్నామన్న సీడీపీవో
అల్లరి చేస్తోందన్న కారణంతో మూడున్నరేళ్ల చిన్నారి ముఖంపై అగ్గిపుల్ల కాల్చి చురకలు పెట్టిందో అంగన్‌వాడీ ఆయా. విశాఖపట్టణంలోని సీతంపేట పరిధి రాజేంద్రనగర్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి కనకమ్మవారి వీధి అంగన్‌వాడీ కేంద్రంలో నిన్న పిల్లలకు ఆటపాటలు నేర్పుతున్నారు. ఆ సమయంలో ఓ చిన్నారి అల్లరి చేస్తుండడంతో రేష్మా అనే ఆయా కోపంతో ఊగిపోయింది. వెంటనే అగ్గిపుల్ల వెలిగించి చిన్నారి ముఖంపై చురకలు పెట్టింది. బాధ భరించలేని చిన్నారి ఏడుస్తూ కేకలు వేస్తున్నా ఆయా వదల్లేదు. బాలిక ముఖంపై కాలిన గాయాలను తల్లి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా, అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్న భవనంపైనే సీడీపీవో కార్యాలయం ఉండడం గమనార్హం. ఈ ఘటనపై స్పందించిన సీడీపీవో.. సూపర్‌వైజర్‌ను బాధిత బాలిక ఇంటికి పంపి విచారణ చేస్తున్నట్టు చెప్పారు. నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Visakhapatnam
Anganwadi
Girl Child
Anganwadi Aya

More Telugu News