Kerala: పంతం నెగ్గించుకున్న కేరళ సర్కారు.. ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు!

  • గవర్నర్‌కు ఛాన్సలర్ హోదా తొలగింపు బిల్లుకు ఆమోదం
  • సవరణలు సూచించిన ప్రతిపక్షం 
  • నిరాకరించడంతో వాకౌట్
  • ఇకపై యూనివర్సిటీ చాన్సలర్‌గా మాజీ న్యాయమూర్తుల నియామకం
Kerala Assembly passes Bill for removing Governor as Chancellor of universities

రాష్ట్ర గవర్నర్ మహ్మద్ అరిఫ్ ఖాన్‌కు కేరళ ప్రభుత్వం షాకిచ్చింది. విశ్వవిద్యాలయాలకు ఇప్పటి వరకు గవర్నరే ఛాన్సలర్‌గా వ్యవహరిస్తుండగా, ఇకపై ఆ అవకాశం లేకుండా తీసుకొచ్చే బిల్లును కేరళ శాసనసభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం.. ఇకపై యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా విద్యారంగ నిపుణులను నియమిస్తారు. 

విజయన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సమ్మతి తెలిపిన ప్రతిపక్ష యూడీఎఫ్ కొన్ని సవరణలు సూచించింది. అయితే, వాటిని ఆమోదించేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఆ తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రకటించారు. 

బిల్లు ఆమోదం పొందడంతో యూనివర్సిటీల చాన్స్‌లర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులను కానీ, కేరళ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తిని కానీ నియమించాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రంలోని 14 యూనివర్సిటీలకు 14 మంది ఛాన్సలర్లను నియమించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. దీనికి స్పందించిన న్యాయశాఖ మంత్రి పి. రాజీవ్ బదులిస్తూ.. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో చాన్సలర్‌ను నియమించే అంశాన్ని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.

More Telugu News