AP Special Status: పార్లమెంటులో మరోసారి ప్రత్యేక హోదా ప్రస్తావన... కేంద్రానిది అదే మాట!

  • 2014లో రాష్ట్ర విభజన
  • అపరిష్కృతంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం
  • పార్లమెంటులో ప్రశ్నించిన టీడీపీ ఎంపీలు
  • అన్ని రాష్ట్రాలు సమానమేని కేంద్రం స్పష్టీకరణ
Center reiterates its stand on Special Status for AP

ఏపీకి ప్రత్యేక హోదా అంశం గత ఎనిమిదేళ్లుగా అపరిష్కృతంగానే మిగిలిపోయింది. తాజాగా పార్లమెంటులో ఈ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. కానీ కేంద్రం వైఖరిలో మాత్రం మార్పులేదు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? అంటూ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రశ్నించారు. అటు లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా విభజన అంశాలపై ప్రశ్నించారు. 

దీనిపై కేంద్రం బదులిస్తూ, 14, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నామని వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో ఎలాంటి వ్యత్యాసం చూపడంలేదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామని పేర్కొంది. తద్వారా ప్రత్యేక హోదా అంశం తమ దృష్టిలో లేదని పరోక్షంగా వెల్లడించింది. 

నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. 14వ ఆర్థిక సిఫారసులను పరిగణనలోకి తీసుకుని 2015-2020 రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని వెల్లడించారు. 15వ ఆర్థికసంఘం 41 శాతం పన్నుల వాటాకు సిఫారసు చేసిందని పేర్కొన్నారు.

More Telugu News