కాకాణి కరవు కహానీలు చెబుతున్నాడు: సోమిరెడ్డి

Somireddy fires on CM Jagan and minister Kakani
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వరి, పత్తి, మిరప, ఇతర వాణిజ్య పంటలు ఘోరంగా దెబ్బతిని రైతులంతా దిక్కుతోచక విలపిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ రాష్ట్ర వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కరవు కహానీలు చెబుతూ, పనిగట్టుకొని మరీ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. తద్వారా సమస్యల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

సోమిరెడ్డి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ... మాండూస్ తుపాను ధాటికి రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లితే, నష్టనివారణ చర్యలు చేపట్టకుండా, వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వ్యవసాయమంత్రి కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు టైమ్ లో కరవు అని, జగన్ వచ్చాక వర్షాలే వర్షాలని వాగుతున్నాడని మండిపడ్డారు. జగన్ రెడ్డే రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయానికి పట్టిన పెద్ద దరిద్రం అని సోమిరెడ్డి విమర్శించారు. 

"మంత్రిది మిడిమిడి జ్ఞానమని ఆయన మాటల్లోనే అర్థమవుతోంది. 2020లో రాష్ట్రంలో 161 మండలాల్లో కరవు వచ్చిన విషయం మంత్రికి తెలియదా? 73 మండలాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొన్నాయన్న వాస్తవం కాకాణి విస్మరించారా? రాష్ట్రంలో మూడేళ్లు వర్షాలున్నా కూడా రాష్ట్ర రైతాంగం ఏం బాగుపడిందో మంత్రి చెప్పాలి. 

జగన్ రెడ్డి పాలన ప్రారంభం కాగానే రాష్ట్ర రైతాంగం, వ్యవసాయరంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. వైసీపీ ప్రభుత్వ చట్టాలతో ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. తుపాను దెబ్బకు పొలాల్లో ఉన్న వరితోపాటు, కోసిన వరి కూడా నేలపాలైంది. ధాన్యపురాశులు నీళ్లలో తేలియాడుతున్నాయి. మిరప, పత్తిపంటలు దెబ్బతినడమేగాక, వాణిజ్యపంటలు నేలకొరిగాయి. గోదావరి జిల్లాల్లో 40 వేల టన్నుల ధాన్యంపై తుపాను ప్రభావం చూపింది.

ఆక్వా రైతులకు జరిగిన నష్టం అంతాఇంతా కాదు. రొయ్యలు వైరస్ బారిన పడే ప్రమాదం ఏర్పడింది. మాండూస్ తుపాన్ తో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే లెక్కకట్టి, మీనమేషాలు లెక్కించకుండా అన్నదాతల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 

జగన్ హయాంలో  రైతులు సంతోషంగా ఉంటే, రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఎందుకుంది కాకాణి? గతంలో చంద్రబాబు హయాంలో  రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 6, 5, 4, స్థానాల్లో ఉంటే, రాజశేఖర్ రెడ్డి రాగానే 2వ స్థానానికి వచ్చింది. అలానే  2014లో చంద్రబాబుగారి పాలనలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 8వ స్థానంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇప్పుడు 3వ స్థానానికి చేరింది. ఆత్మహత్యల్లో రాష్ట్రం ముందు నిలవడమేనా జగన్ రెడ్డి సాధించిన వ్యవసాయ ప్రగతి? జగన్ హయాంలో కౌలురైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 2వ స్థానంలో ఎందుకుందో సమాధానం చెప్పు కాకాణి?" అంటూ సోమిరెడ్డి నిలదీశారు.
Go Back to Shorts
Somireddy Chandra Mohan Reddy
Jagan
Kakani Govardhan Reddy
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News