mask rule: హైదరాబాద్ లోని ఆ ప్రభుత్వ ఆఫీసులో మాస్క్‌ లేకుంటే నో ఎంట్రీ!

  • జీహెచ్ఎంసీ ఆఫీసులో కఠినంగా అమలుచేస్తున్న సిబ్బంది
  • మాస్క్ పెట్టుకోకుంటే కమిషనర్ చాంబర్ లోకి నో ఎంట్రీ
  • బయట కూడా మాస్కులు దొరకట్లేదని వాపోతున్న జనం
  • మాస్కులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి!
no mask no entry rule still practicing in GHMC

చైనాలో మినహా ప్రపంచమంతటా కరోనా ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. మన దేశంలోనైతే రోజువారీ కేసులు ఐదు వందల లోపే నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా వైరస్ అంటే ఇప్పుడు జనాల్లో భయం పోయింది. కొంతమంది ఇప్పటికీ మాస్క్, శానిటేషన్ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, అవేవీ ఇప్పుడు తప్పనిసరి కాదని ప్రభుత్వం పేర్కొంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రవేశపెట్టిన నో మాస్క్ నో ఎంట్రీ, హ్యాండ్ శానిటేషన్ వంటి నిబంధనలను ప్రభుత్వం ఎత్తేసింది.

ప్రస్తుతం మాస్క్ ధరించడం ఆప్షనల్.. అంటే ధరించాలా? వద్దా? అనేది మనిష్టమే. అయితే, ఇప్పటికీ మాస్క్ పెట్టుకోలేదంటే లోపలికి రానిచ్చేదిలేదని జీహెచ్ఎంసీ ఆఫీసులో సిబ్బంది తేల్చిచెబుతున్నారు. కార్యాలయంలో నో మాస్క్ నో ఎంట్రీ బోర్డును ఉంచడంతో పాటు దానిని కచ్చితంగా అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గదిలోకి వెళ్లాలంటే మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి.. లేదంటే వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సిందే.

ఈ విషయం తెలియక కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ను కలిసేందుకు వెళ్లిన చాలామంది ఆయనను కలవకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. ఆంక్షలు ఎత్తేయడంతో జనం మాస్కులు పెట్టుకోవడంలేదు, ఫలితంగా మాస్కులు అమ్మేవాళ్లు కూడా కనిపించడంలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఆఫీసు బయట కూడా మాస్క్ లు దొరకట్లేదని అక్కడికి వచ్చిన వాళ్లు చెబుతున్నారు. మాస్కులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

More Telugu News