Telangana: నకిలీ సీబీఐ అధికారికి బంగారం, డబ్బు ఇచ్చిన హైదరాబాదీ వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు

  • ఇప్పటికే ఈ వ్యవహారంలో మంత్రి గంగులకు సీబీఐ నోటీసులు
  • గురువారం సీబీఐ విచారణకు హాజరైన గంగుల
  • సోమవారం విచారణకు రావాలంటూ వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు
cbi issues notices to 4 hydarabady vusinessmen in fake cbi officer case

తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ను సీబీఐ విచారణకు హాజరయ్యేలా చేసిన నకిలీ సీబీఐ అధికారి వ్యవహారం మరింత మంది తలకు చుట్టుకుంది. తానో సీనియర్ ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుని తిరుగుతున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి... తాను ప్రస్తుతం సీబీఐలో పని చేస్తున్నానని చెప్పుకుంటూ ఇటీవలే మంత్రి కమలాకర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇటీవలే కమలాకర్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు... ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు గురువారం కమలాకర్ సీబీఐ అధికారుల ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు.

ఓ వైపు గంగుల కమలాకర్ విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈ వ్యవహారంలో మరో నలుగురు బడా వ్యాపారవేత్తలకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సదరు వ్యాపారులను సీబీఐ ఆదేశించింది. తానో సీబీఐ అధికారిని అని శ్రీనివాసరావు చెప్పడంతోనే... భయపడిపోయిన హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలు ఆయనకు బారీ ఎత్తున డబ్బుతో పాటు బంగారాన్ని అందజేశారు. ఈ వ్యవహారం బయటపడటంతోనే సదరు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

More Telugu News