Jharkhand: పెళ్లిళ్లలో డ్యాన్సులు, మ్యూజిక్‌పై నిషేధం విధించిన ముస్లిం మతపెద్దలు

Clerics ban dance music and fireworks in Muslim weddings in Jharkhand
  • ఝార్ఖండ్‌లోని ధన్‌బాధ్ జిల్లాలోని ముస్లిం మతపెద్దల నిర్ణయం
  • ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ. 5,100 జరిమానా
  • రాత్రి 11 గంటల తర్వాత నిఖా జరిపించినా జరిమానా తప్పదని హెచ్చరిక
  • డ్యాన్సులు, డీజే వంటివి ఇస్లామ్ కు విరుద్ధమని స్పష్టీకరణ
ఝార్ఖండ్‌లోని ధన్‌బాధ్ జిల్లాలోని ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వివాహాల్లో ఇస్లామిక్ వ్యతిరేక విధానాలైన డ్యాన్సులు చేయడం, పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టడం, బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా చెల్లించుకోకతప్పదని హెచ్చరికలు జారీ చేశారు. 

నిర్సా బ్లాక్‌లోని సిబిలిమడీ జామా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ నిన్న ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. ఇస్లాం మత విధానానికి అనుగుణంగా వివాహాలు జరగాలని తాము ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు చెప్పారు. కాబట్టి ఇకపై నిఖా (పెళ్లి)లో డ్యాన్సులు వేయరాదని, డీజే మ్యూజిక్ పెట్టకూడదని, బాణసంచా కాల్చకూడదని పేర్కొన్నారు. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై రూ. 5,100 జరిమానా విధిస్తామన్నారు. 

ఇస్లాంలో ఇలాంటి వాటికి తావులేదన్నారు. అంతేకాదు, ఇది ప్రజలకు అసౌకర్యంగానూ ఉంటుందన్నారు. రాత్రి 11 గంటల తర్వాత వివాహం జరిపించినా జరిమానా తప్పదన్నారు. లిఖితపూర్వకంగా క్షమాపణ కూడా చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం తెలిసిన వారు దానిని తమ వారికి చేరవేయాలని ఇమామ్ సూచించారు.
Jharkhand
Muslim Weddings
Muslim Clerics

More Telugu News