New Delhi: ప్రయాణికుడితో అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడిన కారు డ్రైవర్.. మనసులు గెలుచుకున్న వీడియో ఇదే!

Delhi Cab Driver And Passengers Conversation In Fluent Sanskrit
  • ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఘటన
  • సంస్కృతంలో సంభాషణ మొదలుపెట్టిన ప్రయాణికుడు
  • సంస్కృతంలోనే అనర్గళంగా బదులిచ్చిన డ్రైవర్
  • గతంలో సంస్కృతంలో గల్లీ క్రికెట్‌కు కామెంటరీ చెప్పిన ట్విట్టర్ యూజర్
దేశంలోని అత్యంత పురాతన భాష అయిన సంస్కృతాన్ని ‘దేవభాష’గా చెబుతారు. అంతేకాదు, ఇతర భాషలకు కూడా ఇదే మూలం. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ భాషను మాట్లాడేవారు ఇప్పుడు ఒక్క శాతం మంది మాత్రమేనంటే ఆశ్చర్యం కలగకమానదు. హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో హిందూ రుత్విక్కులు కొందరు వాడుతూ ఉంటారు. కొందరు ఇంకా ఈ భాషను వాడుతుండడం వల్లే అదింకా సజీవంగా ఉంది. 

తాజాగా, ఢిల్లీలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడితో అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి నెటిజన్ల మనసులు గెలుచుకుంది. ఇండియా గేట్ సమీపంలో ఈ వీడియోను రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. ‘అమేజింగ్’ క్యాప్షన్‌తో ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. ‘అద్భుతం.. ఈ కారు డ్రైవర్ నాతో ఈ ఉదయం సంస్కృతంలో  మాట్లాడాడు’ అని పేర్కొన్నాడు. అతడి ట్విట్టర్ హ్యాండిల్ ప్రకారం.. ఆయన మాతృభాష సంస్కృతంగా తెలుస్తోంది.

కారు డ్రైవర్‌తో ప్రయాణికుడు సంస్కృతంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. డ్రైవర్ అతడికి సంస్కృతంలోనే సమాధానం చెప్పడంతో ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. తేరుకుని అతడి ఊరు, ఇతర వివరాల గురించి ఆరా తీశాడు. తన పేరు అశోక్ అని, తనది ఉత్తరప్రదేశ్‌లోని గోండా అని డ్రైవర్ బదులిచ్చాడు. అలాగే, అతడి కుటుంబ సభ్యుల వివరాలను కూడా చక్కని సంస్కృతంలో చెప్పుకొచ్చాడు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు 2.62 లక్షల లైకులు రాగా, 2,400 మంది రీట్వీట్ చేశారు. కొందరు ఈ వీడియోకు సంస్కృతంలోనే కామెంట్లు చేశారు. సంస్కృతాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే ఆ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఓ యూజర్ రాసుకొచ్చాడు. వారి సంభాషణ వినడానికి అద్భుతంగా, వినసొంపుగా ఉందని మరో యూజర్ కామెంట్ చేశాడు. సాధారణ సంభాషణ కూడా ఏదో పూజ చేస్తున్నట్టుగా ఉందని ప్రశంసించాడు. కాగా, ఈ ట్విట్టర్ యూజర్ గత నెలలోనూ వైరల్ అయ్యాడు. ఓ గల్లీ క్రికెట్ మ్యాచ్‌కు సంస్కృతంలో చెప్పిన కామెంటరీ వీడియో వైరల్ అయింది. అనర్గళంగా అతడు సంస్కృతంలో కామెంటరీ చెబుతున్న తీరుకు నెటిజన్లు ముచ్చటపడ్డారు.
New Delhi
Cab Driver
Sanskrit
Viral Videos

More Telugu News