Kane Williamson: సన్ రైజర్స్ తనను విడుదల చేయడంపై కేన్ విలియమ్సన్ స్పందన

Kane Williamson reacts after Surisers released him
  • విలియమ్సన్ ను విడుదల చేసిన సన్ రైజర్స్ 
  • స్పందించిన విలియమ్సన్ 
  • తన ముందు అనేక ఆప్షన్లు ఉన్నాయని వెల్లడి 
న్యూజిలాండ్ జట్టును అత్యంత సమర్థంగా నడిపిస్తున్న కేన్ విలియమ్సన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మాత్రం విజయాల బాట పట్టించలేకపోయాడు. ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ యాజమాన్యం నిన్న కేన్ విలియమ్సన్ ను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ నిర్ణయం కారణంగా టీ20 కెరీర్ పై పునరాలోచన చేస్తారా? అన్న ప్రశ్నకు విలియమ్సన్ స్పందించాడు. 

ప్రపంచంలోనే అనేక లీగ్ పోటీలు జరుగుతున్నాయని, తన ముందు అనేక ఆప్షన్లు ఉన్నాయని తెలిపాడు. ఐపీఎల్ నిస్సందేహంగా అద్భుతమైన లీగ్ అని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లు ప్రపంచవ్యాప్త లీగ్ ల్లో పాల్గొంటూ వేర్వేరు జట్లకు ఆడుతుండడాన్ని చూడొచ్చని, ఈ నేపథ్యంలో తనకు అనేక అవకాశాలున్నాయని, తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. 

కాగా, విలియమ్సన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే... ఐపీఎల్ ఆడనంత మాత్రాన తన కెరీర్ కు వచ్చిన నష్టమేమీ లేదని, ఈ లీగ్ కాకపోతే మరో లీగ్ లో ఆడుకోవచ్చు అనే ధోరణి కనిపిస్తోంది. 

అటు, చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

ధోనీ ఇంకెంతో కాలం జట్టును నడిపించకపోవచ్చని, రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగిస్తే ఆ నిర్ణయం బెడిసికొట్టినందున ఇకపై మరో ప్రత్యామ్నాయం దిశగా చెన్నై యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు సన్ రైజర్స్ కేన్ విలియమ్సన్ ను విడుదల చేసినందున, అతడిని వేలంలో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేయొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది చూడాలి.
Kane Williamson
SRH
IPL
New Zealand

More Telugu News