insurence: రూ.399 లకే రూ.10 లక్షల ప్రమాద బీమా పాలసీ.. వివరాలు ఇవిగో!

  • టాటా ఏఐజీ, పోస్టాఫీసుల  బీమా పథకం
  • ఏ రకమైన ప్రమాదమైనా బీమా వర్తిస్తుంది
  • ఆసుపత్రిలో చేరితే చికిత్స ఖర్చులు
  • పాలసీదారుడు చనిపోతే పిల్లల చదువుల కోసం రూ.లక్ష అందజేస్తుంది
India Post offering Rs 10 lakh cover in this health policy

కరోనా ప్రభావంతో ఆరోగ్య భీమా ఆవశ్యకత చాలామందికి తెలిసొచ్చింది. తగిన పాలసీని ఎంచుకుని తమ కుటుంబానికి బీమా చేయిస్తున్నారు. అయితే, ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉండడంతో ఇప్పటికీ కొందరు ఆరోగ్య బీమాకు దూరంగానే ఉంటున్నారు. అలాంటివారి కోసమే ఈ పోస్టాఫీసు ప్రమాద బీమా పథకం.. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాన్ని ఈ స్కీంలో పొందవచ్చు. ఏటా రూ. 299, లేదా రూ. 399ల ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుందని పోస్టల్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదం ఎలాంటిదైనా ఈ పథకం కింద బీమా వర్తిస్తుందని వివరించారు. టాటా ఏఐజీ సంస్థతో కలిసి ఈ బీమా పథకాన్ని పోస్టల్ శాఖ తన వినియోగదారులకు అందజేస్తోంది. వయసు 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఈ పాలసీ తీసుకోవాలని అనుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతా తెరవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ రెండు పథకాలకు సంబంధించి మరిన్ని వివరాలకు దగ్గర్లోని పోస్టాఫీసులో సంప్రదించాలని అధికారులు సూచించారు.

రూ. 399 ప్రీమియంతో..
ఏటా రూ. 399 ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకుంటే.. ఏదైనా ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం కలిగినా, ప్రమాదంలో అవయవం తొలగించినా, పక్షవాతం బారిన పడినా.. పరిహారం కింద బీమా కంపెనీ రూ. 10 లక్షలు చెల్లిస్తుంది. మరణించిన సందర్భంలో పాలసీదారుడి అంత్యక్రియల కోసం రూ. 5 వేలు తక్షణ అవసరాల కోసం అందజేస్తుంది. పాలసీదారుడి పిల్లల చదువులకు రూ. లక్ష పరిహారం చెల్లిస్తుంది. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా చేరితే.. ఖర్చుల కోసం రూ. 60 వేలు, ఔట్ పేషెంట్ గా చికిత్స తీసుకుంటే రూ. 30 వేలు అందజేస్తుంది. ఇన్ పేషెంట్ గా ఉన్నపుడు మొదటి 10 రోజుల వరకు రోజూ రూ. వెయ్యి చొప్పున బెడ్ చార్జీలనూ చెల్లిస్తుంది.

రూ. 299 ప్రీమియంతో..
ఈ ప్రమాద రక్షణ బీమా కింద శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం కలిగినా, పక్షవాతం వచ్చినా రూ. 10 లక్షల వరకు బీమా కంపెనీ అందజేస్తుంది. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా చేరితే.. ఖర్చుల కోసం రూ. 60 వేలు, ఔట్ పేషెంట్ గా చికిత్స తీసుకుంటే రూ. 30 వేలు అందజేస్తుంది. అంత్యక్రియల ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చు, బెడ్ ఖర్చుల వంటివి ఈ పథకంలో ఉండవు.

More Telugu News