Prime Minister: భారత ప్రధాని మోదీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ మాటా మంతీ

  • జీ20 సదస్సు కోసం ఇండోనేషియా చేరిన పలు దేశాల అధినేతలు
  • తొలి రోజు సమావేశాల్లోనే పలకరించుకున్న మోదీ, సునాక్ లు
  • మోదీ కనిపించగానే ఆయనను పలకరించేందుకు వచ్చిన సునాక్
  • కుశల ప్రశ్నలు వేసుకున్న ఇరు దేశాధినేతలు
  • భారత్, బ్రిటన్ ల మధ్య రేపు ద్వైపాక్షిక చర్చలు
britain pm rishi sunak greets indian prime minister narendra modi in g20 summit

బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్... మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జీ20 సదస్సు ప్రారంభం కాగా... తొలి రోజే మోదీని రిషి సునాక్ కలిశారు. మోదీ కనిపించగానే... రిషి ఆయన వద్దకు వచ్చి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. 

వాస్తవానికి జీ20 సదస్సులో భాగంగా భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరగనున్నాయి. ఈ చర్చల్లో తమ తమ దేశాల అధికార ప్రతినిధులతో కలిసి మోదీ, సునాక్ పాలుపంచుకోనున్నారు. అయితే ఒకే దేశానికి చెందిన నేతలు కావడంతో వీరిద్దరూ తొలి రోజే తారసపడిన సందర్భంగా పలకరించుకున్నారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్...భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే బ్రిటన్ ప్రధానిగా సునాక్ పదవీ బాధ్యతలు చేపట్టగానే... భారత్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News