tsspdcl: తెలంగాణలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ.. ఈ నెలాఖరులో నోటిఫికేషన్?

  • రద్దయిన వెయ్యి పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్
  • వచ్చే నెల తొలి వారంలోపే విడుదల
  • సబ్ ఇంజనీర్లుగా ఎంపికైన వాళ్లకు నియామక పత్రాల అందజేత
recruitment notification for 1000 posts in tsspdcl

జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ విద్యుత్ శాఖ త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల తొలివారంలో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పోస్టుల భర్తీకి మొన్నటి ఆగస్టులోనే నోటిఫికేషన్ విడుదల చేయగా.. జులై 17న రాతపరీక్ష కూడా పూర్తయింది. అయితే, అభ్యర్థులలో కొంతమంది మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

విద్యుత్ శాఖ ఉద్యోగులు కొందరు డబ్బులు వసూలు చేసి, అభ్యర్థులకు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ జరిపిన పోలీసులు.. రాతపరీక్షలో మాల్ ప్రాక్టీస్ నిజమేనని తేల్చారు. మొత్తం 181 మంది అభ్యర్థుల నుంచి విద్యుత్ శాఖలోని ఐదుగురు ఉద్యోగులు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని రాచకొండ పోలీసులు తేల్చారు. ఆ అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని బయటపెట్టారు. దీంతో సదరు ఉద్యోగులపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వేటు వేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో సదరు నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది.

వెయ్యిమంది జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన ఆ నోటిఫికేషన్ రద్దయింది. ఆ పోస్టుల భర్తీ కోసం తాజాగా కొత్త నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపాయి. మరోవైపు, సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయడంతో, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసినట్టయింది. 

More Telugu News