Super Star Krishna: కృష్ణ మృతికి కారణం ఇదే: వెల్లడించిన వైద్యులు

Continental hospital Said Krishna Died Due To Multi Organ Failure
  • ఆసుపత్రికి వచ్చే సరికే కృష్ణ పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్ గురు ఎన్ రెడ్డి
  • ఆసుపత్రిలో చేరిన రెండు మూడు గంటల తర్వాత పరిస్థితి మరింత విషమం
  • చికిత్స అందించినా ఫలితం ఉండదని వైద్యుల నిర్ధారణ
  • కుటుంబ సభ్యులతో చర్చించి చికిత్స ఆపేసిన వైద్యులు
కార్డియాక్ అరెస్టుతో నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణానికి గల కారణాన్ని వైద్యులు తాజాగా వెల్లడించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే కృష్ణ మరణించారని డాక్టర్ ఎన్ రెడ్డి మీడియాకు తెలిపారు. గుండెపోటుతో ఆయన ఆసుపత్రిలో చేరిన వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత చికిత్స ప్రారంభించామన్నారు. ఆసుపత్రికి వచ్చే సరికే కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు డాక్టర్ గురు ఎన్ రెడ్డి వివరించారు. 

రెండు మూడు గంటల తర్వాత చాలా వరకు అవయవాలు పనిచేయడం మానేశాయన్నారు. నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం కావడంతో అది కూడా చేసినట్టు చెప్పారు. నిన్న సాయంత్రానికే ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందని, ఇక ఇలాంటి చికిత్స అందించినా ఫలితం ఉండదని వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. దీంతో కృష్ణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొన్ని గంటలు మనఃశాంతితో వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి చికిత్స ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ తెల్లవారుజామున 4.09 గంటలకు కృష్ణ తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్ గురు ఎన్ రెడ్డి మీడియాకు వివరించారు.
Super Star Krishna
Continental Hospital
Hyderabad

More Telugu News