Andhra Pradesh: ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ: సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా

  • ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన సీఈఓ
  • రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,54,093గా వెల్లడి
  • మహిళా ఓటర్లు 2,01,34,621 ఉన్నారన్న మీనా
  • 10,52,326 ఓటర్లను తొలగించినట్లు వివరణ
ap ceo releases state voter list

ఆంధ్రప్రదేశ్ లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ ముసాయిదా ప్రకారం నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. వీరిలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు ఉండగా... 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం ఓటర్లలో 68,115 మంది సర్వీసు ఓటర్లు ఉండగా... 3,858 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉందన్నారు. 


వివిధ కారణాలతో ఓటర్ల జాబితా నుంచి 10,52,326 మంది ఓటర్లను తొలగించినట్లు మీనా తెలిపారు. నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే చోట వేర్వేరుగా నమోదైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లుగా ఆయన తెలిపారు. ఫలితంగా గతేడాది కంటే ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 8,82,366 తగ్గిందన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానించడం తప్పనిసరి చేయడం లేదని ఆయన వెల్లడించారు. అయితే ఓటరు కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేసుకున్న ఓటర్ల సంఖ్య 60 శాతానికి పెరిగిందని మీనా తెలిపారు.

More Telugu News