ఇటు కేరళ బ్యూటీ .. అటు హర్యానా భామ!
- కేరళ నుంచి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్
- చేసిన రెండు సినిమాలూ హిట్
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'సార్' మూవీ
- 'హిట్ 2' మూవీతో రానున్న మీనాక్షి
- డిసెంబర్ 2వ తేదీన సినిమా విడుదల
సంయుక్త మీనన్ కేరళ బ్యూటీ. 2016 లోనే మలయాళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, ఆ తరువాత తమిళ సినిమాలను కూడా పలకరించి టాలీవుడ్ కి వచ్చింది. తెలుగులో ముందుగా 'బింబిసార' సినిమాకి సైన్ చేసినప్పటికీ, ముందుగా థియేటర్లకు వచ్చిన సినిమా 'భీమ్లా నాయక్'. ఈ సినిమాలో ఆమె రానా సరసన మెప్పించింది. ఈ రెండు సినిమాలు హిట్ కొట్టడం ఆమెకి కలిసొచ్చింది. ప్రస్తుతం ధనుశ్ జోడీగా ద్విభాషా చిత్రమైన 'సార్' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
ఇక మీనాక్షి చౌదరి విషయానికి వస్తే తాను హర్యానా భామ. సుశాంత్ జోడీగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాను ముందుగా చేసినప్పటికీ, 'ఖిలాడి' సినిమాతో ఆమెకి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, గ్లామర్ పరంగా తనకి రావలసిన మార్కులను వసూలు చేసింది. ఇక తన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'హిట్ 2' ముస్తాబవుతోంది. అడివి శేష్ హీరోగా నాని నిర్మించిన ఈ సినిమా, డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో ఈ భామలిద్దరూ ఇక్కడ నిలదొక్కుకుంటారేమో చూడాలి.