Komatireddy Venkat Reddy: వైరల్ అయిన ఆ ఆడియో నాది కాదు: ఏఐసీసీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ

  • రెండు రోజుల క్రితమే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వెంకటరెడ్డి
  • తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలన్న ఆ వీడియో నకిలీదన్న వెంకటరెడ్డి
  • పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లేదని వాపోయిన భువనగిరి ఎంపీ
Viral Audio Is Fake Its Not Belongs To Me Says Komatireddy Venkatareddy

మునుగోడు ఉప ఎన్నికకు ముందు వైరల్ అయిన ఆడియోపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీకి వివరణ ఇచ్చారు. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మునుగోడు ఎన్నికలకు ముందు వెంకటరెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో ఒకటి బయటకు వచ్చి సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ నాయకుడు జబ్బార్‌తో వెంకటరెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న అందులో.. మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడైన బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని సూచించినట్టుగా ఉంది. 

వీడియో వెలుగులోకి రావడంతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత నెల 23న ఏఐసీసీ వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆడియోపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచే ఆయన తన వివరణ పంపినట్టు తెలుస్తోంది. తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. 

విద్యార్థి దశ నుంచే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉన్నానని అందులో పేర్కొన్న ఆయన, పార్టీలో తనకు ప్రాధాన్యం కొరవడిందని వాపోయారు. ఉద్దేశపూర్వకంగానే తనను కించపరుస్తున్నారని పేర్కొన్నారు. వైరల్ అయిన ఆ ఆడియో తనది కాదని, నకిలీదని వివరణ ఇచ్చారు. ఇంకా పలు అంశాలను ఆ వివరణలో ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

More Telugu News