Himachal polls: దేశంలో తొలి ఓటరు.. 106 ఏళ్ల వయసులో ఓటు హక్కు వినియోగం

  • హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి
  • రెడ్ కార్పెట్ వేసి ఆయన నుంచి ఓటు నమోదు చేసుకున్న సిబ్బంది
  • ఈ నెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి పోలింగ్
 India first voter aged 106 casts postal ballot as elderly set example for youth

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు బద్ధకిస్తున్న అక్షరాస్యులు, యువతకు 106 ఏళ్ల వృద్ధుడు ఆదర్శంగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిమాచల్ అసెంబ్లీకి ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో వృద్ధుల కోసం ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేసింది. దీనికి కిన్నౌర్ జిల్లాకు చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగికి రెడ్ కార్పెట్ పరిచి ఆయనకు స్వాగతం పలికింది. వయసులో మాత్రమే కాకుండా నేగికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆయన స్వతంత్ర భారతదేశ మొదటి ఓటరు కావడం విశేషం. అందుకే ఆయన ఓటును నమోదు చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ తెలిపారు.

నేగి పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపెట్టినా అనారోగ్యం కారణంగా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారని చెప్పారు. తన తండ్రి 1951లో ఓటు వేసి మొదటి ఓటరు అయ్యారని శ్యామ్ శరణ్ నేగి చిన్న కుమారుడు చందన్ ప్రకాష్ తెలిపారు. ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నారని తెలిపారు. ఈ వయస్సులో కూడా ఓటు వేయడం ద్వారా పౌరుడిగా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. నేగి హిమాచల్ ప్రదేశ్ కు జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఆయన ఓటు హక్కు వినియోగంచుకోవడం ఇది 34వ సారి కావడం విశేషం.

More Telugu News