తలుపులకు ఇష్టమొచ్చిన రంగు వేసినందుకు.. స్కాట్లాండులో 19 లక్షల జరిమానా వడ్డింపు
- ఇంటి యజమానికి ఫైన్ విధించిన స్కాట్లాండ్ అధికారులు
- తలుపుల రంగు మార్చాలంటూ ఆదేశాలు
- మార్చేదిలేదని తేల్చిచెప్పడంతో ఫైన్ విధింపు
స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ కు చెందిన మిరండా డిక్సన్ తన ఇంటికి ఇటీవలే మరమ్మతులు చేయించారు. ఈ పనుల్లో భాగంగా ప్రధాన ద్వారానికి గులాబీ రంగు వేయించారు. దీనిపై ఎడిన్ బర్గ్ సిటీ కౌన్సిల్ ప్లానర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ నిర్ణయించిన ప్రకారం తెలుపు రంగు వేయాలని ఆదేశించారు.
అయితే, గులాబీ రంగు తలుపులతో తన ఇంటికే అందం వచ్చిందని డిక్సన్ చెప్పారు. వీధిలో వెళ్లే వాళ్లను తన ఇల్లు ఎంతగానో ఆకర్షిస్తోందని, క్షణం ఆగి ఓ సెల్ఫీ తీసుకొని మరీ వెళుతున్నారని వివరించారు. తలుపుల రంగు మార్చడం తనకిష్టంలేదని తేల్చిచెప్పారు. దీంతో కౌన్సిల్ అధికారులు డిక్సన్ కు 20 వేల పౌండ్ల (మన రూపాయల్లో సుమారు 19 లక్షలు) జరిమానా విధించారు. కౌన్సిల్ ఆదేశాలను ధిక్కరించి ఇంటి తలుపులకు గులాబీ రంగు వేసినందుకు ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించారు.