laptop theft: లాప్ టాప్ ఎత్తుకెళ్లిన దొంగ.. క్షమాపణ కోరుతూ మెయిల్!

  • మరో దారి లేకే దొంగతనం చేశానంటూ వివరణ
  • లాప్ టాప్ లోని ముఖ్యమైన ఫైల్స్ ను పంపించిన దొంగ
  • సంతోషించాలో.. బాధపడాల్నో తెలియట్లేదంటూ లాప్ టాప్ ఓనర్ ట్వీట్
Thief Sends Email To Apologise For Stealing Mans Laptop

‘ఆర్థిక కష్టాల్లో ఉన్నా, మరో దారి కనిపించక మీ లాప్ టాప్ ఎత్తుకెళ్లాల్సి వచ్చింది. నన్ను క్షమించండి’ అంటూ ఓ దొంగ సదరు లాప్ టాప్ యజమానికి ఈమెయిల్ చేశాడు. అంతేకాదు, లాప్ టాప్ లో ఉన్న పరిశోధన పత్రాలను పంపించి, ఇంకా ఏమైనా ముఖ్యమైన ఫైల్స్ ఉంటే చెప్పండి పంపించేస్తా అని అడిగాడు. దీంతో లాప్ టాప్ పోయినందుకు బాధపడాలో లేక కష్టపడి చేసిన పరిశోధనకు సంబంధించిన ఫైల్స్ దక్కినందుకు సంతోషపడాలో తెలియట్లేదని ఆ యువకుడు ట్విట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొంగతనం చేస్తే చేశాడు కానీ విలువైన ఫైల్స్ పంపించాడు, ఎంతైనా మంచి దొంగేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

జ్వెల్లీ థిక్సో అనే ట్విట్టర్ యూజర్ ఈ వివరాలను ఓ ట్వీట్ లో వెల్లడించారు. ‘‘నిన్న రాత్రి నా లాప్ టాప్ ను ఎవరో దొంగిలించారు. ఈ రోజు ఉదయం నా మెయిల్ ఐడీ నుంచే నాకు మెయిల్ వచ్చింది. తెరిచి చూస్తే.. ‘నిన్న మీ లాప్ టాప్ ను ఎత్తుకెళ్లింది నేనే. చాలా కష్టాల్లో ఉన్న నాకు మరో దారి కనిపించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ పని చేయాల్సి వచ్చింది. ఇక లాప్ టాప్ లో మీరు దాచుకున్న రీసెర్చ్ ఫైల్స్ ను ఈ మెయిల్ తో పంపిస్తున్నా. లాప్ టాప్ లో ఇంకా ఏమైనా ముఖ్యమైన ఫైల్స్ ఉంటే చెప్పండి పంపించేస్తా. అయితే, సోమవారంలోపే అడగండి ఆ తర్వాత లాప్ టాప్ నా దగ్గర ఉండదు’ అని ఉందని థిక్సో చెప్పాడు. దొంగ తనకు పంపిన ఈమెయిల్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టాడు.

More Telugu News