loan app: భర్త ఆత్మహత్య చేసుకున్నా ఆగని లోన్ యాప్ వేధింపులు

Hubby ended life then loan app sharks kept harassing wife
  • ఏడాదిగా వేధింపులకు గురిచేస్తున్నారని భార్య ఆవేదన
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగలేదని ఆరోపణ
  • తన భర్త మరణానికి కారణమయ్యారని రోధిస్తున్న వైనం
లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. రెండేళ్ల క్రితం ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. కొంతకాలం మౌనంగా ఉన్న లోన్ యాప్ నిర్వాహకులు సదరు యువకుడి భార్యకు ఫోన్ చేశారు. భర్తను కోల్పోయి, నెలల పసికందుతో పుట్టింటికి చేరిన ఆ మహిళను ఏడాదిగా వేధిస్తున్నారు. భర్త మరణానికి, తన జీవితం అస్తవ్యస్తం కావడానికీ కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయినా వేధింపులు ఆగట్లేదని వాపోయారు.

హైదరాబాద్ కు చెందిన పండిటి సునీల్ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కాలంలో ఉద్యోగం కోల్పోవడం, అదే సమయంలో భార్య పండిటి రమ్యశ్రీ గర్భంతో ఉండడంతో అప్పులను ఆశ్రయించాడు. ఓ లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. అప్పు తీసుకున్న వారం రోజుల నుంచే సునీల్ కు ఫోన్లు, మెసేజ్ లు రావడం మొదలైందని రమ్యశ్రీ చెప్పారు. 

ఓ రోజు తనతో పాటు కుటుంబ సభ్యులు బంధువుల ఫోన్లకు కూడా మెసేజ్ లు వచ్చాయని వివరించారు. సునీల్ తమకు బాకీ ఉన్నాడని, ఆ మొత్తం చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ మెసేజ్ లో ఉందన్నారు. ఈ గొడవ కొనసాగుతుండగానే తమకు బాబు పుట్టాడని రమ్యశ్రీ వివరించారు. ఓవైపు సరైన ఉద్యోగం లేక, మరోవైపు లోన్ యాప్ వేధింపులతో 2020 డిసెంబర్ లో తన భర్త సునీల్ ఉరేసుకున్నాడని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

భర్త మరణంతో పుట్టింటికి చేరిన రమ్యశ్రీకి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. మీ భర్త బాకీ ఉన్న మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని ఫోన్లలో బెదిరిస్తున్నారని రమ్యశ్రీ వివరించారు. ఏడాదిగా ఈ వేధింపులు ఆగడంలేదని ఆమె చెప్పారు. వాళ్ల వేధింపుల వల్లే తను భర్తను కోల్పోయానని, అయినా ఆపకుండా తననూ వేధిస్తున్నారని రమ్యశ్రీ వాపోయారు.
loan app
harassment
husband suicide

More Telugu News