G Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆంక్షలు విధించిన ఎన్నికల సంఘం

  • జగదీశ్ రెడ్డికి నిన్న ఈసీ నోటీసులు
  • నేడు వివరణ ఇచ్చిన మంత్రి
  • అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ
  • సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని ఆంక్షలు
EC imposes restrictions on minister Jagadish Reddy

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నోటీసులపై మంత్రి జగదీశ్ రెడ్డి నేడు ఈసీకి వివరణ ఇచ్చారు. 

అయితే మంత్రి వివరణపై ఎన్నికల సంఘం అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ఆయనపై ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలకు హాజరు కావొద్దని స్పష్టం చేసింది. మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆంక్షలు ఈ సాయంత్రం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున ఈ నెల 25న మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందాలంటే టీఆర్ఎస్ కు ఓటేయాలని, పథకాలు వద్దనుకుంటే బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. 

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్నిల సంఘం నేటి మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలంటూ మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

More Telugu News