Pakistan: జింబాబ్వే చేతిలో ఓడిన పాకిస్థాన్... జింబాబ్వే అధ్యక్షుడు, పాక్ ప్రధాని మధ్య మాటల యుద్ధం

Zimbabwe President and Pakistan Prime Minister engaged in Twitter banter
  • నిన్న పెర్త్ లో పాక్ కు భంగపాటు
  • ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో ఓటమి
  • ఈసారి రియల్ మిస్టర్ బీన్ ను పంపాలన్న జింబాబ్వే అధ్యక్షుడు
  • దీటుగా బదులిచ్చిన పాక్ ప్రధాని
జింబాబ్వేతో మ్యాచ్ లో పాకిస్థాన్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ దంబుద్జో ఎంనంగాగ్వా ఆనందంతో పొంగిపోయారు. అదే ఊపులో పాకిస్థాన్ జట్టును ఉద్దేశించి ఓ చులకన వ్యాఖ్య చేశారు. 

ఈ అద్భుత విజయం పట్ల తమ జాతీయ క్రికెట్ జట్టు ఆటగాళ్లను అభినందించిన ఆయన, "ఈసారైనా రియల్ మిస్టర్ బీన్ ను పంపించండి" అంటూ ఎద్దేవా చేశారు. 

అందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీటుగా స్పందించారు. "మా వద్ద రియల్ మిస్టర్ బీన్ లేకపోవచ్చు... కానీ మా వద్ద నిజమైన క్రికెట్ స్ఫూర్తి ఉంది. అంతేకాదు, మాకో సరదా అలవాటు కూడా ఉంది... పడిపోయిన చోటే ఉండిపోం... వెంటనే పుంజుకుంటాం" అని బదులిచ్చారు. 

ఈ క్రమంలో, జింబాబ్వే జట్టు ప్రదర్శనను షెహబాజ్ షరీఫ్ మెచ్చుకున్నారు. "కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ ప్రెసిడెంట్... ఇవాళ మీ జట్టు బాగా ఆడింది" అంటూ ప్రశంసించారు. 

నిన్న పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేయగా, పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులే చేసి ఓటమిపాలైంది. 

ఇప్పటికే టీమిండియా చేతిలో ఓడిన పాక్ జట్టు... జింబాబ్వే చేతిలోనూ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆఖరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా, షహీన్ అఫ్రిది ఒక్క పరుగు మాత్రమే తీయడంతో పాక్ అనూహ్య పరాజయాన్ని చవిచూసింది.
Pakistan
Zimbabwe
T20 World Cup
President
Prime Minister

More Telugu News