T20 World Cup: రెండో మ్యాచ్ లోనే తేరుకున్న ఆసీస్.. శ్రీలంకను చిత్తు చేసిన ఆతిథ్య జట్టు

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 20 ఓవర్లలో 157 పరుగులు చేసిన లంక బ్యాటర్లు
  • 18 బంతుల్లో 59 పరుగులతో విరుచుకుపడ్డ స్టోయినిస్
  • 7 వికెట్ల తేడాతో లంకపై గెలిచిన ఆసీస్
australia wins over srilanka with 7 wickets

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 లో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఈ మెగా సిరీస్ కు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆసీస్ కు న్యూజిల్యాండ్ చేతిలో పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ పరాభవం నుంచి తేరుకునే దిశగా సాగిన ఆస్ట్రేలియా జట్టు... మంగళవారం రాత్రి ముగిసిన మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్... శ్రీలంక జట్టును 157 పరుగులకే పరిమితం చేసి.. ఆ తర్వాత 16.3 ఓవర్లలోనే 158 పరుగులు చేసి విక్టరీ నమోదు చేసింది. 

శ్రీలంక ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా వచ్చిన పథుమ్ నిస్సంక (40) ఆ జట్టుకు శుభారంభాన్నే ఇచ్చాడు. నిస్సంకకు జోడిగా వచ్చిన కుశాల్ మెండిస్ (5) మాత్రం నిరాశ పరిచాడు. రెండో ఓవర్ లోనే లంక తొలి వికెట్ కోల్పోగా... మెండిస్ స్థానంలో వచ్చిన ధనంజయ డిసిల్వా (26), ఆ తర్వాత వచ్చిన ఛరిత్ అసలంక (38 నాటౌట్) ఒకింత జోరు చూపించినా... వరుసగా వికెట్లు పడటంతో లంక బ్యాటర్లు భారీ స్కోర్లు రాబట్టలేకపోయారు. వెరసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి లంక 157 పరుగులు మాత్రమే చేసింది.

158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (11), ఆరోన్ ఫించ్ (31) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వార్నర్ స్వల్ప స్కోరుకే అవుటైనా... మిచెల్ మార్షల్ (18), గ్లెన్ మ్యాక్స్ వెల్ (23) క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ (59) పరుగులతో వీర విహారం చేశాడు. కేవలం 18 బంతులను మాత్రమే ఎదుర్కొన్న స్టోయినిస్ 6 సిక్స్ లు, 4 ఫోర్లు బాది లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 327.77 స్ట్రయిక్ రేటుతో ఆడిన స్టోయినిస్ 16.9 ఓవర్లలోనే ఆసీస్ కు విజయాన్ని అందించాడు. అంతిమంగా 7 వికెట్ల తేడాతో లంకపై ఆసీస్ విజయం సాధించింది.

More Telugu News