Sundar Pichai: పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

Sundar Pichai gives fitting reply to Pak cricket fans
  • నిన్న మెల్బోర్న్ లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
  • పాకిస్థాన్ పై భారత్ విజయం
  • చివరి మూడు ఓవర్లు మళ్లీ చూశానన్న సుందర్ పిచాయ్
  • మొదటి 3 ఓవర్లు కూడా చూడాలన్న పాక్ ఫ్యాన్స్
  • అర్షదీప్, భువీ అద్భుతంగా బౌల్ చేశారన్న పిచాయ్
నిన్న మెల్బోర్న్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ యుద్ధాన్ని తలపించింది అంటే అతిశయోక్తి కాదు. ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కోసం కొదమసింహాల్లా పోరాడిన మ్యాచ్ అది. ఈ పోరులో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ జయభేరి మోగించింది. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. 

యూజర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన... నిన్నటి మ్యాచ్ లోని చివరి మూడు ఓవర్లను నేడు మరోసారి వీక్షించి పండుగ చేసుకున్నానని వెల్లడించారు. ఏం మ్యాచ్... ఏం పెర్ఫార్మెన్స్...! అంటూ తన స్పందన తెలియజేశారు.

అయితే, ఈ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తమ అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేసి, సుందర్ పిచాయ్ చేతిలో వెర్రిపప్పలు అయ్యారు. టీమిండియా ఇన్నింగ్స్ లో చివరి మూడు ఓవర్లు మళ్లీ చూసి ఎంజాయ్ చేశానని సుందర్ పిచాయ్  పేర్కొనగా, టీమిండియా ఇన్నింగ్స్ లో మొదటి మూడు ఓవర్లు కూడా చూడాలని పాక్ అభిమానులు వెటకారంగా ట్వీట్ చేశారు. 

ఆ మొదటి మూడు ఓవర్లలో టీమిండియా ఓ వికెట్ కోల్పోయి పరుగులు తీసేందుకు చాలా ఇబ్బంది పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాక్ అభిమానులు పైవిధంగా పేర్కొన్నారు. అయితే, సుందర్ పిచాయ్ వారికి ఎంతో తెలివిగా బదులిచ్చారు. 

"ఆ పని కూడా చేశాను. మ్యాచ్ మొదటి మూడు ఓవర్లు చూశాను. అర్షదీప్, భువీ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అంటూ పాక్ అభిమానులకు చురక అంటించారు. 

నిన్నటి మ్యాచ్ లో పాక్ మొదట బ్యాటింగ్ చేయగా, రెండో ఓవర్లోనే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ డకౌట్ అయ్యాడు. పాక్ అభిమానులు టీమిండియా ఇన్నింగ్స్ మొదటి మూడు ఓవర్లను ప్రస్తావించగా, సుందర్ పిచాయ్ పాకిస్థాన్ ఇన్నింగ్స్ మొదటి మూడు ఓవర్ల విషయాన్ని ఎత్తిచూపారు. దాంతో పాక్ అభిమానులు తోక ముడిచారు.
Sundar Pichai
Team India
Pakistan
Fans
T20 World Cup
Google
India

More Telugu News