Ukraine: చదువు పూర్తయ్యాకే తిరిగివస్తాం.. ఉక్రెయిన్ లోని భారత విద్యార్థుల ప్రకటన

  • యుద్ధం నేపథ్యంలో తిరిగి వెళ్లిపోవాలంటూ భారత ఎంబసీ విజ్ఞప్తి
  • ఉక్రెయిన్ కు వచ్చి రెండు మూడు నెలలే అయిందంటున్న విద్యార్థులు
  • ప్రాణాలు పోయినా మధ్యలో వదిలేసి రాలేమని తేల్చిచెప్పిన వైనం
Indian students refuse to leave Ukraine despite govt advisory

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం తీవ్రం కావడం, ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబులతో విరుచుకుపడుతుండడంతో అక్కడున్న భారత విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఇటీవలే ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వెంటనే వెళ్లిపోవాలని విద్యార్థులకు సూచనలు జారీ చేసింది.

అయితే, రాయబార కార్యాలయం విజ్ఞప్తిని అక్కడున్న భారతీయ విద్యార్థులు తిరస్కరిస్తున్నారు. యుద్ధం ప్రారంభంలో ఇలాగే హెచ్చరించడంతో ప్రాణభయంతో ఉరుకులు పరుగులతో భారత్ కు వెళ్లిపోయామని చెప్పారు. కొంతకాలం తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని, తరగతులు ప్రారంభిస్తున్నామని యూనివర్సిటీలు సమాచారం ఇవ్వడంతో ఇటీవలే తిరిగొచ్చామని వివరించారు. 

ఈ ఆకస్మిక రాకపోకల వల్ల డబ్బు చాలా ఖర్చయిందని, ఆర్థికంగా తమ కుటుంబాలపై మరింత భారం మోపలేమని తేల్చిచెప్పారు. తమ చదువులు పూర్తిచేసేందుకు భారత ప్రభుత్వం సాయం చేయడంలేదని ఆరోపించారు. భారత్ లోని మెడికల్ కళాశాలల్లో చదువుకునేందుకు తమకు అవకాశమివ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో చదువు పూర్తయ్యేవరకూ ఉక్రెయిన్ లోనే ఉండడం మినహా తమకు ప్రత్యామ్నాయం లేదని వివరించారు. ఈలోపు బాంబు దాడుల్లో మరణిస్తే తమ మృతదేహాలను భారత్ కు పంపించాలని కోరారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ లో దాదాపు 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. అక్కడి మెడికల్ కాలేజీల్లో వీరంతా వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో వీరంతా భారతదేశానికి తిరిగొచ్చారు. యూనివర్సిటీల పిలుపుతో ఇటీవలే మళ్లీ అక్కడికి వెళ్లారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ తీవ్రత పెరగడంతో భారత్ లోని వీరి తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది. 

మరోవైపు, ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన తమను దేశంలోని మెడికల్ కాలేజీల్లో చేర్చుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వచ్చే నెల 1న విచారణ జరగనుందని, సుప్రీం తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని ఉక్రెయిన్ లోని భారత విద్యార్థులు చెప్పారు.

More Telugu News