Balakrishna: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని బాలకృష్ణ పిలుపు

  • వచ్చే ఏడాది మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • పశ్చిమ రాయలసీమ స్థానం నుంచి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పోటీ
  • భూమిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్న బాలయ్య
  • తద్వారా నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపు
Balakrishna calls vote for Bhumireddy Ramgopal Reddy in graduate MLC elections

ఏపీలో మరికొన్ని నెలల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. కాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి టీడీపీ మద్దతుతో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ... 2023 మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు అని తెలిపారు. ఆయన టీడీపీ మానవ వనరుల విభాగం రాష్ట్ర సభ్యుడిగా, టీడీపీ నాయకత్వ శిక్షణ శిబిరం డైరెక్టర్ గా ఉన్నారని వివరించారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పాటుపడుతున్నారని బాలయ్య తెలిపారు. 

ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పట్టభద్రులు, ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, నందమూరి అభిమానులు, టీడీపీ కుటుంబ సభ్యులు రాంగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ ఎన్నిక ఓ సదవకాశం అని పేర్కొన్నారు. 

అర్హులైన వారు ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఓటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓటును భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి వేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ మద్దతుతో వెన్నపూస రవీంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో రవీంద్రారెడ్డి తండ్రి, ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం 2023 మార్చి నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిపికేషన్ వెలువడింది.

More Telugu News