రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయండి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో
- ఈ ఎన్నికల్లో పార్టీలను చూడొద్దని నేతలకు వెంకట్ రెడ్డి సూచన
- ఏ ఇబ్బంది వచ్చినా తాను చూసుకుంటానని భరోసా
- ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ ను అవుతానన్న భువనగిరి ఎంపీ
- పాదయాత్ర చేపట్టి సీఎంను అవుతానని వెల్లడి
- ఆడియోపై స్పందించని వైనం
- కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా టూర్ వెళ్లినట్లు సమాచారం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటిదాకా ప్రచారానికి హాజరు కాని... వెంకట్ రెడ్డి... తాజాగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పారట. ఫోన్లలో జరిగిన ఈ సంభాషణకు చెందిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఆడియోలో పలువురు కాంగ్రెస్ నేతలతో వెంకట్ రెడ్డి మాట్లాడారు. పార్టీలను పక్కనపెట్టి రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తానే చూసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు.
అలాగే, ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ ను అవుతానని కూడా అన్నారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని, రాష్ట్రానికి సీఎంను కూడా అవుతానని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియోపై ఇప్పటిదాకా వెంకట్ రెడ్డి స్పందించలేదు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినట్లుగా సమాచారం. మరో 10 రోజుల పాటు ఆయన ఆస్ట్రేలియాలోనే ఉంటారని తెలుస్తోంది.