JP Nadda: యాదాద్రి జిల్లా మల్కాపురంలో జేపీ నడ్డాకు సమాధి కట్టిన వైనం.. తీవ్ర ఆగ్రహంతో టీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చిన కిషన్ రెడ్డి

 JP Naddas grave in Telangana Munugode ahead of crucial bypolls Kishan reddy warns TRS
  • బతికున్న వ్యక్తికి సమాధి కట్టి టీఆర్ఎస్ అన్ని హద్దులు దిగజారిందని కిషన్ రెడ్డి ఆగ్రహం
  • తన సహనాన్ని అసమర్థతగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
  • వినాశకాలే విపరీత బుద్ధి అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి నిర్మించారు. 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా దండుమల్కాపురంలో పర్యటించిన సమయంలో ఫ్లోరైడ్‌ రీసెర్చ్‌ అండ్‌ మిటిగేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరేళ్లు దాటినా ఇప్పటికీ ఆ హామీ నెరవేరకపోవడంతో ఆ స్థలంలో జేపీ నడ్డాకు సమాధి కట్టారు. అయితే, ఇది టీఆర్ఎస్ పని అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికి ఉన్నవారికీ సమాధి కట్టే దుస్సంప్రదాయానికి టీఆర్ఎస్ తెర తీసిందన్నారు. నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా? ఆయన మీద ఈ అక్కసు ఎందుకని ప్రశ్నించారు. 

మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందన్నారు. బతికున్న వ్యక్తికి సమాధి కట్టే నీచ చర్యకు దిగడం ద్వారా హద్దులు దాటి టీఆర్ఎస్ దిగజారిందని మండిపడ్డారు. గతంలో తన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారన్నారు. తమ సహనాన్ని అసమర్థతగా భావిస్తే టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ చర్యపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం అని అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఆమె ట్వీట్ చేశారు.
JP Nadda
grave
munugode
G. Kishan Reddy
warning
TRS

More Telugu News