jayalalitha: జయలలిత మరణంపై జస్టిస్ ఆర్ముగస్వామి నివేదికలో వెల్లడైన అనుమానాలు ఇవీ...!

  • జయను ఆసుపత్రిలో చేర్చిన రోజు ఏం జరిగింది?
  • ఆసుపత్రిలో సీసీటీవీ కెమెరాలు ఎందుకు తీసేశారు?
  • యాంజియో చికిత్సను ఎందుకు అడ్డుకున్నారు?
  • ఏ క్షణంలోనైనా డిశ్చార్జి చేస్తామన్న వైద్యుల ప్రకటన పూర్తిగా అవాస్తవం
  • శశికళతో పాటు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విచారించాల్సిందే
  • రిపోర్టులో జస్టిస్ ఆర్ముగస్వామి సిఫార్సు 
doubts on jayalalitha death by armugaswamy report

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎలా చనిపోయారు.. ఆమె అనారోగ్యానికి గురవడానికి కారణాలేంటి?.. తన నివాసంలో జయ స్పృహ తప్పాక జరిగిన సంఘటనలను రహస్యంగా ఎందుకు ఉంచారు... జయ మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ వ్యక్తం చేసిన సందేహాలివి. 

దీంతో పాటు ఆసుపత్రిలో ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిందేనని పేర్కొంది. జయలలిత సన్నిహితురాలు శశికళ, ఫ్యామిలీ డాక్టర్ శివకుమార్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు తదితరులను సమగ్రంగా విచారిస్తే చాలా ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయని జస్టిస్ ఆర్ముగస్వామి ప్రభుత్వానికి సూచించారు. ఈ సూచనపై సానుకూలంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం.. త్వరలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 

రిపోర్టులో వ్యక్తంచేసిన అనుమానాలు..
జయలలితను ఆసుపత్రిలో చేర్చిన రోజు ఇంట్లో ఏంజరిగింది? జయ అనారోగ్యానికి గురికావడానికి కారణమేంటి..
ఆసుపత్రిలో సీసీటీవీ కెమెరాలను ఎందుకు తొలగించారు? ఆసుపత్రి గదులలో దాదాపు పదింటిని శశికళ బంధువులు ఆక్రమించారు. కారణం..
అపోలో ఆసుపత్రికి ఐదుసార్లు వచ్చిన ఎయిమ్స్ వైద్యబృందం జయ చికిత్సపై ఎలాంటి సిఫారసు చేయలేదు..
జయకు గుండె ఆపరేషన్ చేయాలని అమెరికా నుంచి వచ్చిన వైద్యుడు డాక్టర్ సమీర్ శర్మ సూచించినా ఆపరేషన్ చేయకపోవడానికి కారణం..
యాంజియో చేయాలంటూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన హృద్రోగ నిపుణుడు రిచర్డ్ పీలే చెప్పినా అపోలో వైద్యులు పట్టించుకోలేదు..
జయ 2016 డిసెంబరు 5న రాత్రి 11:30 గంటలకు చనిపోయారని వైద్యులు ప్రకటించారు. వాస్తవానికి అంతకుముందు రోజు (4వ తేదీ) 
మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 గంటల మధ్య జయలలిత కన్నుమూశారు. ఆసుపత్రిలో సాక్షుల విచారణలో తేలిన విషయమిది. జయ మృతిపై తప్పుడు ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? జయను ఏ క్షణంలోనైనా ఇంటికి పంపించేయవచ్చన్న(డిశ్చార్జి) ప్రకటన కూడా అవాస్తవమే.
చికిత్సకు జయ కోలుకుంటున్నారు.. ఇడ్లీ తిన్నారు, వాకింగ్ చేశారంటూ వైద్యుల ప్రకటనలే తప్ప వాస్తవంగా జయను చూసినవాళ్లు ఎవరూ లేరు..

పార్టీకి దూరమైన శశికళ
జయలలిత మరణించిన తర్వాత అన్నా డీఎంకే పార్టీ పగ్గాలను వీకే శశికళ చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈలోపు అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువరించడంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తనకు నమ్మకస్తుడు ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టి శశికళ జైలుకు వెళ్లారు. విడుదలయ్యాక ఆమెను పార్టీ నుంచే వెలివేశారు. దీంతో కొంతకాలం శశికళ రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవలే రాష్ట్రమంతా పర్యటిస్తూ తన మద్దతుదారులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ రిపోర్టుతో శశికళపై అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, జయలలిత మద్దతుదారులు ఆగ్రహంగా ఉన్నారు. 

  • Loading...

More Telugu News