Pawan Kalyan: పవన్ కల్యాణ్ కచ్చితంగా ప్యాకేజీ తీసుకున్నాడు... జనసేనానిపై ఏపీ మంత్రుల ఫైర్

AP Ministers replies to Pawan Kalyan furious remarks
  • ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్
  • వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం
  • స్పందించిన వైసీపీ మంత్రులు
  • పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం గొప్పనుకుంటున్నాడన్న అప్పలరాజు
  • చంద్రబాబు మాటలే పవన్ నోటి వెంట వస్తున్నాయన్న జోగి రమేశ్
తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడడం తెలిసిందే. దీనిపై వైసీపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. 

పవన్ కల్యాణ్ కచ్చితంగా ప్యాకేజీ తీసుకున్నాడని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఆయన జీవితం 'మూడు' చుట్టూనే తిరుగుతోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంటర్ లో మూడు గ్రూపులు జాయిన్ అయ్యాడని, మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, మూడు పార్టీలతో జతకట్టాడని విమర్శించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం గొప్పలాగా ఫీలవుతున్నాడని మండిపడ్డారు. 

మరో మంత్రి జోగి రమేశ్ స్పందిస్తూ, సినిమా షూటింగులు లేకపోవడంతో మంగళగిరిలోనే ఉన్న పవన్ కల్యాణ్... చంద్రబాబు ఏంచెబితే అది చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు చెప్పిన మాటలే పవన్ నోటి వెంట వస్తుంటాయని అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరక్కపోవడంతో పవన్ ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. నువ్వు (పవన్), బీజేపీ, చంద్రబాబు కలిసి వచ్చినా ఏమీ సాధించలేరని జోగి రమేశ్ స్పష్టం చేశారు. 

అటు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. అయ్యా పీకే.. నువ్వు పీకేదేమీ లేదు అంటూ వ్యాఖ్యానించారు. సినిమాల్లో మాదిరి ఓపెనింగ్ షాట్లు, ఇంటర్వెల్ బ్యాంగ్ లు, క్లైమాక్స్ పంచ్ లు తప్ప ఏమీ పీకలేవంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Pawan Kalyan
Seediri Appalarju
Jogi Ramesh
YSRCP
Janasena

More Telugu News