Pratibha Bharathi: అన్ స్టాపబుల్ షో ద్వారానైనా రోజా, అంబటి వాస్తవాలు తెలుసుకోవాలి: ప్రతిభా భారతి

Former speaker Pratibha Bharathi counters Roja and Ambati comments on Chandrababu
  • బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హాజరైన చంద్రబాబు
  • నాడు ఎన్టీఆర్ విషయంలో ఏం జరిగిందో చెప్పిన వైనం
  • విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు
  • జగన్ రెడ్డే అసలైన వెన్నుపోటుదారుడు అంటూ ప్రతిభా భారతి వ్యాఖ్యలు
ఆహా ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహించే అన్ స్టాపబుల్-2 కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనడం తెలిసిందే. అయితే ఈ షోలో చంద్రబాబు చెప్పిన విషయాలపై వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ మహిళా నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి స్పందించారు. అసలైన వెన్నుపోటుదారుడు జగన్ మోహన్ రెడ్డేనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

"తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభంపై ఇంతకాలం దుష్ప్రచారం చేస్తూ వచ్చిన వైసీపీ నేతలు... అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు వాస్తవాలు చెప్పడాన్ని జీర్ణించుకోలేక అవాకులు, చవాకులు పేలుతున్నారు. ప్రజలను ఎంతోకాలం మోసం చేయలేరని వైసీపీ నేతలు గుర్తించాలి. 

నాడు రామకృష్ణ స్టూడియోను ధ్వంసం చేయించారు. నేడు ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం పదవి కోసం తండ్రి శవం దొరక్కముందే రాజకీయాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్ రెడ్డి కాదా? 

జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం మంత్రులు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఆనాడు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబుగారిని టార్గెట్ చేస్తూ ఇంతకాలం ప్రజలను పక్కదారి పట్టించారు. ఇకపై వారి ఆటలు సాగవు. అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు, బాలకృష్ణ వాస్తవాలను ప్రజలకు వివరించారు. 

రోజా తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అంబటి రాంబాబు, రోజా అన్ స్టాపబుల్ షో చూసి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి" అని ప్రతిభా భారతి హితవు పలికారు.
Pratibha Bharathi
Chandrababu
Jagan
Unstoppable
Balakrishna
Roja
Ambati Rambabu
TDP
YSRCP

More Telugu News