Andhra Pradesh: టీడీపీ కేంద్ర కార్యాల‌య మీడియా కోఆర్డినేటర్‌ను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ.. ఖండించిన చంద్రబాబు

  • గుంటూరులో న‌రేంద్ర‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ
  • కేసేమిటో చెప్ప‌లేదంటున్న టీడీపీ నేత‌లు
  • న‌రేంద్ర అరెస్ట్‌ను ధృవీక‌రించని సీఐడీ
  • సీఐడీ అధికారుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు
  • న‌రేంద్ర‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌
ap cid arrests tdp central office media co ordinator narendra

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీకి చెందిన‌ కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దార‌ప‌నేని న‌రేంద్ర‌ను సీఐడీ అధికారులు బుధ‌వారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని త‌న నివాసంలో న‌రేంద్ర ఉండ‌గా...అక్క‌డికి వ‌చ్చిన సీఐడీ అధికారులు ఆయ‌న‌ను బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

ఏ కేసులో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నార‌న్న విష‌యాన్ని సీఐడీ అధికారులు వెల్లడించ‌లేద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. న‌రేంద్ర‌ను అదుపులోకి తీసుకున్న విష‌యాన్ని సీఐడీ అధికారులు ఇంకా ధృవీక‌రించ‌లేదు. దీంతో న‌రేంద్ర కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

ఇదిలా ఉంటే... న‌రేంద్ర అరెస్ట్‌ను టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఖండించారు. నరేంద్రను విడుదల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ పోలీసుల తీరు మారడం లేదని మండిపడ్డారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పు పట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో పని చేసే వారిని అరెస్టు చేసి భయపెట్టాలనేదే సీఎం జగన్ వైఖర‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. 

ఇటువంటి కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా....పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి పూట చేస్తున్న అరెస్టులు కోర్టులో నిలబడవని చంద్రబాబు అన్నారు. దీనికి అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయ‌న‌ హెచ్చరించారు.

More Telugu News