Gujarat: తల్లిదండ్రులతో గొడవ పడిన చిన్నారి.. కిడ్నాప్‌గా భావించి పట్టుకున్న స్థానికులు

  • గుజరాత్‌లోని వడోదరలో ఘటన
  • వ్యాన్‌‌ను అడ్డగించి దంపతులను కిందికి దించిన స్థానికులు
  • పోలీసులకు కూడా సమాచారం
  • చిన్నారి తమ కుమారుడేనని నిరూపించుకోవడంతో కథ సుఖాంతం
locals detained couple suspected that they are kidnappers in gujarat

ఐదేళ్ల కుమారుడితో కలిసి వాహనంలో వెళ్తున్న తల్లిదండ్రులకు ఊహించని ఘటన ఎదురైంది. చిన్నారి వారిపై అరుస్తూ, గొడవ పడుతుండడంతో వారు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని భావించిన స్థానికులు వారిని పట్టుకుని నిలదీశారు. దీంతో వారు అతడు తమ కుమారుడేనని నిరూపించుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ జంట తమ ఐదేళ్ల కుమారుడితో కలిసి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి కుమారుడు ఏదో విషయమై వారిపై అరుస్తూ గొడవకు దిగాడు. అది గమనించిన స్థానికులు వాహనాన్ని అడ్డుకుని వారిని కిందికి దించారు.బాలుడ్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారా? అని వారిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో వారు అవాక్కయ్యారు.

అదేం లేదని, ఆ చిన్నారి తన కుమారుడేనని చెప్పినా వారు వినిపించుకోలేదు సరికదా.. పోలీసులకు కబురు అందించారు. వారికి కూడా  ఆ జంట ఇదే సమాధానం చెప్పింది. బాలుడు బధిరుడు కావడంతో తామే అతడి తల్లిదండ్రులమని అతడితో చెప్పించలేకపోయారు. దీంతో ఆ తర్వాత సీన్ వారింటికి మారింది. తమ ఆధార్, ఇతర వివరాలను చూపిస్తూ పిల్లాడు తమ కుమారుడేనని సాక్ష్యాలను పోలీసులకు చూపడంతో కథ సుఖాంతమైంది. ఇందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్టు ఇటీవల పుకార్లు రావడం, బాలుడి ప్రవర్తన వంటివి స్థానికులను అనుమానించేలా చేశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచి సంకేతమని పోలీసులు తెలిపారు.

More Telugu News