Astronaut: భూమికి తిరిగిరాగానే పెళ్లి చేసుకుంటా... ఓ వృద్ధురాలికి టోకరా వేసిన నకిలీ వ్యోమగామి

Fake astronaut duped Japan woman and cheated her pretext of marriage
  • పెళ్లి పేరుతో మోసం
  • జపాన్ మహిళ నుంచి రూ.24.8 లక్షలు రాబట్టిన వైనం
  • ఇంకా డబ్బు కావాలని డిమాండ్
  • అనుమానించిన మహిళ
  • పోలీసులకు ఫిర్యాదు
తాను రష్యా వ్యోమగామినని, ప్రస్తుతం అంతరిక్షంలో అంతర్జాతీయ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లో ఉన్నానంటూ ఓ వ్యక్తి జపాన్ లోని ఓ వృద్ధ మహిళకు టోకరా వేశాడు. భూమికి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటానంటూ ఆ 65 ఏళ్ల మహిళను నమ్మించాడు. ఆమె నుంచి రూ.24.8 లక్షల వరకు కాజేశాడు. 

సదరు మహిళ జపాన్ లోని షిగా రాష్ట్రంలో నివసిస్తోంది. గత జూన్ లో ఆ నకిలీ వ్యోమగామి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. స్పేస్ సూట్ ధరించి ఉన్న అతడి ఫొటోలు చూసిన ఆ వృద్ధురాలు అతడు నిజంగానే వ్యోమగామి అని భావించింది. అక్కడ్నించి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 

'లైన్' అనే జపాన్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలు పంపుకునేవారు. కొన్నిరోజుల తర్వాత ఆ వ్యక్తి లవ్ ప్రపోజల్ చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ వృద్ధురాలిని నమ్మించాడు. జపాన్ లో ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని ఉందంటూ ఆమెను ఉచ్చులోకి లాగాడు. 

అయితే, ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి రావాలంటే రాకెట్ ఫీజు కోసం డబ్బు కావాలని ఆ మోసగాడు మహిళకు సందేశం పంపాడు. అది నిజమేనని నమ్మిన ఆ వృద్ధ మహిళ ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 5 మధ్యలో పలు దఫాలుగా డబ్బు పంపించింది.

అతడు మరింత డబ్బు కావాలని కోరుతుండడంతో ఆమెలో అనుమానం మొదలైంది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడు నకిలీ వ్యోమగామి అని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
Astronaut
Woman
Cheating
Japan
Russia
ISS
Rocket

More Telugu News