Nandamuri Ramakrishna: అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ సంఘీభావం

Nandamuri Ramakrishna supports Amaravathi farmers Maha Padayatra
  • పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల మహాపాదయాత్ర
  • రైతులతో కలిసిన నడిచిన నందమూరి రామకృష్ణ
  • వైసీపీ నేతలపై విమర్శలు
  • భూమి విలువ వారికేం తెలుస్తుందని వ్యాఖ్యలు
అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మద్ధతు పలికారు. మహా పాదయాత్ర నేడు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగుతుండగా, నందమూరి రామకృష్ణ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. పెనుగొండ, కవటం, మార్టేరు మీదుగా మూడు గంటలపాటు నందమూరి రామకృష్ణ పాదయాత్ర చేశారు. భారీవర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆయన రైతులతో కలిసి నడిచారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులను అవమానిస్తూ హేళనగా మాట్లాడటం తగదన్నారు. వైసీపీ నేతలు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చుంటే భూమి విలువ ఏమిటో వారికి తెలిసేదని అన్నారు. 

ప్రపంచంలో గానీ, దేశంలో గానీ ఎక్కడా మూడు రాజధానులు విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. నిజమైన పాలనా వికేంద్రీకరణను మండల వ్యవస్థ ద్వారా దివంగత నేత ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. 

చంద్రబాబునాయుడు హయాంలో కియా, హీరో, హోండా, ఇసుజు, అశోక్ లేలాండ్, మొబైల్ ఫోన్ల పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, 11 జాతీయ విశ్వవిద్యాలయాలను జిల్లాకు ఒక్కటి చొప్పున ఏర్పాటు చేసి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించారని అన్నారు. 

కాగా, నేటి పాదయాత్రలో మాజీమంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యుడు వీరంకి గురుమూర్తి తదితరులు కూడా పాల్గొన్నారు.
Nandamuri Ramakrishna
Maha Padayatra
Farmers
Amaravati
TDP
NTR
Chandrababu
AP Capital

More Telugu News