pcc chief: బీఆర్ఎస్ కు ఈసీ ఆమోదంపై ఢిల్లీ హైకోర్టుకు: రేవంత్ రెడ్డి

Will move Delhi HC again against Election Commission nod for BRS pcc chief revanth reddy
  • టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా దాఖలైన కేసు తేల్చే వరకు ఆమోదించొద్దని డిమాండ్
  • గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ నేతల వసూళ్లపై లోగడ రేవంత్ పిటిషన్
  • ఈ కేసులో తీర్పుతో టీఆర్ఎస్ గుర్తింపు కోల్పోతుందున్న పీసీసీ చీఫ్
టీఆర్ఎస్ పేరును భార‌త్ రాష్ట్ర స‌మితిగా మార్చాలని కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన పిటిషన్ పై తేల్చే వరకు పార్టీ పేరును మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.

ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు పార్టీ కోసం నిధులు వసూలు చేశారని, టీఆర్ఎస్ గుర్తింపును రద్ధు చేయాలని కోరుతూ లోగడ రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘2018లో నేను దాఖలు చేసిన కేసులో కోర్టు తీర్పు ఇస్తే  టీఆర్ఎస్ తన గుర్తింపును కోల్పోతుంది. ‘గులాబీ కూలీ’ పేరుతో టీఆర్ఎస్ నేతలు వందలాది కోట్ల రూపాయలను వసూలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిధుల వసూళ్లలో పాల్గొంటే వారు నేరానికి పాల్పడినట్టే అవుతుంది. ఇది లంచం తీసుకోవడంతో సమానం’’అని రేవంత్ రెడ్డి చెప్పారు. 

గులాబీ కూలీ పేరుతో నిధుల వసూళ్ల అంశాన్ని పరిశీలించాలని ఈసీని ఢిల్లీ హైకోర్టు కోరినా, ఎటువంటి చర్య లేదని రేవంత్ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రత్యర్థులుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
pcc chief
revanth reddy
Election Commission
BRS
TRS

More Telugu News