బీసీసీఐ తదుపరి బాస్‌గా రోజర్ బిన్నీ!
- ముగియనున్న గంగూలీ పదవీ కాలం
- ఈ నెల 18న ఎన్నికలు
- అదే రోజు సాయంత్రం ఫలితాల వెల్లడి
- గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన బిన్నీ
ఈ నెల 18న జరగనున్న బీసీసీఐ ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశానికి సంబంధించిన వివరాలను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఎస్) కార్యదర్శి సంతోష్ మేనన్‌కు బదులుగా బిన్నీ పేరు కనిపించింది. బీసీసీఐ అధ్యక్ష రేసులో బిన్నీ ఉన్నాడన్న వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది. బిన్నీ ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీకే) చీఫ్‌గా ఉన్నాడు.
బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలకు ఈ నెల 11, 12 తేదీల్లో నామినేషన్ స్వీకరిస్తారు. 13న వాటిని పరిశీలిస్తారు. 14న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 18న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం బీసీసీఐ బాస్ ఎవరన్నది వెల్లడిస్తారు.